'మెఘా'కు ప్రేమతో తెలంగాణ సర్కారు 538 కోట్ల అంచనాల పెంపు !
కరోనా ఇంజనీర్లు కూడా ఇంత దారుణ అంచనాలు తయారు చేయరేమో
ప్రభుత్వాల సహకారంతో అడ్డగోలుగా అంచనాల పెంపు
ఆ తర్వాత నీకింత..నాకింత గోల్ మాల్ అనే ఆరోపణలు
తెలంగాణ సర్కారు జీవో కలకలం
కరోనా కాలంలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి కూడా ఇంత దారుణంగా అంచనాలు తయారు చేయటం చేతకాదేమో. ఈ అంచనాలు చూసిన తర్వాత ఎవరికైనా ఇదే అనుమానం రావటం సహజం. అంతే కాదు..విచిత్రంగా మెఘా ఇంజనీరింగ్ సంస్థ ఎక్కడ ఉంటే అక్కడ అంచనాలు ఖచ్చితంగా పెరగాల్సిందే. అది సాగునీటి శాఖ అయినా..వాటర్ వర్క్స్, పంచాయతీరాజ్ శాఖ అయినా. అంతే కాదు అది ఏ రాష్ట్రంలో ఈ అంచనాల పెంపు కామన్ అన్నట్లు సాగుతుంది ఆ కంపెనీ వ్యవహరం. ఏడాది కూడా తిరక్కుండానే అంటే 2020 జనవరిలో ఇచ్చిన జీవో ప్రకారం 674 కోట్ల రూపాయలు ఉన్న అంచనాలు 2021 జులై 29 వచ్చేసరికి ఏకంగా 1212 కోట్ల రూపాయలకు పెరిగిపోయాయి. అంటే ఏడాదిన్నర సమయంలో ఇంత దారుణంగా అంచనాలు పెరిగిపోతాయా?. జీవో చూసే వాళ్ళను మరింత గందరగోళంలోకి నెట్టేందుకు అదనపు పనులు కూడా అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు. తొలి సారి అంచనాలు వేసినప్పుడు లేని అదనపు వర్క్..మధ్యలో ఎలా వచ్చింది. ఎందుకొచ్చింది?.
అంటే ప్రాజెక్టుకు రూపకల్పన చేసి..పనులు ప్రారంభించే ముందే ఇంజనీర్లకు, అధికారులకు ఓ సమగ్ర అవగాహన ఉండదా?. నిజంగా ఉంటే ఇలా జరుగుతుందా?. అలా కాకుండా అవసరాల కోసం ఎలా అంటే అలా ఇలా మార్పులు చేసుకుంటూ పోవచ్చా?. తాజా జీవోలో ఫోకస్ అంతా అంచనాల పెంపుపైనే పెట్టారు. అదనపు పని తొలుత ఇచ్చిన జీవోకు భిన్నంగా వేరే చోట చేసేదా?. లేక పాత ప్రాజెక్టులోనే భాగంనే ఇచ్చారా?. అయితే కొత్తగా అదనపు పని ఎలా పుట్టుకొచ్చింది..ఇది అంచనాల పెంపు కోసం తెరపైకి తీసుకొచ్చారనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సర్కారు తీరు చూస్తుంటే వంద కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలిచి పనులు అప్పగించి..తర్వాత వెయ్యి కోట్ల అదనపు పనులకు కూడా అదే సంస్థకు అప్పగించమనేలా ఉందని ఓ సీనియర్ ఇంజనీర్ వ్యాఖ్యానించారు.
ఏడాదిన్నర కాలంలో అంచనాల్లో ఇంత భారీ పెరుగుదల..అదనపు పనులు పెట్టి ఏకంగా 538 కోట్ల రూపాయలు అప్పగించటం సరికాదని..ఖచ్చితంగా ఇందులో మతలబు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నుంచి జనగాం, గజ్వేల్, ఆలేరు-భువనగిరి, మేడ్చల్ కు తాగునీరు తీసుకెళ్ళే పథకంలో ఈ వింత చోటుచేసుకుంది. ప్రభుత్వాల్లో పనులు అవసరాల కోసం కాకుండా ప్రభుత్వ పెద్దలు..కాంట్రాక్టర్ల అవసరాలకు అనుగుణంగా మారుతున్నాయనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అవి అలా కొనసాగుతూనే ఉన్నాయి.