Telugu Gateway
Telugugateway Exclusives

టీడీపీ పొలిట్ బ్యూరోలో 'ఫ్యామిలీ ప్యాక్'

టీడీపీ పొలిట్ బ్యూరోలో ఫ్యామిలీ ప్యాక్
X

నారా చంద్రబాబు. నారా లోకేష్. నందమూరి బాలకృష్ణ. ఇదీ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరోలో ఫ్యామిలీ ప్యాక్. అసలు బాలకృష్ణ పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేదే చాలా తక్కువ. అలాంటిది ఏకంగా ఇఫ్పుడు ఆయనకు పార్టీ పొలిట్ బ్యూరోలో చోటు కల్పించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు సోమవారం నాడు ప్రకటించిన కమిటీల్లో వింతలు ఎన్నో ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు వర్ల రామయ్య 'అత్యంత శక్తివంతమైన నేత'గా ఎదిగారు. ఎందుకంటే ఆయనకు అత్యంత కీలకమైన పొలిట్ బ్యూరోలో చోటు దక్కటంతోపాటు..టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కూడా వర్ల రామయ్యకు దక్కింది. తెలుగుదేశం పార్టీ ఘోరపరాజయం తర్వాత టీడీపీ వ్యవస్థాపక సభ్యుడైన గోరంట్ల బుచ్చయ్యచౌదరి వంటి నేతలకు పార్టీ పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించారు. అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఆయనకు సముచిత స్థానం కల్పించలేదు. ఎందుకంటే పార్టీ విషయాలు ఏదైనా నిక్కచ్చిగా మాట్లాడాతారనే విషయం తెలసిందే.

గల్లా అరుణకుమారి ఈ మధ్యే పొలిట్ బ్యూరో పదవికి రాజీనామా చేశారు. పార్టీలో కొనసాగుతా కానీ..పదవులు వద్దన్నారు. ఆమెకు ఇఫ్పుడు జాతీయ ఉపాధ్యక్షరాలు పదవి కట్టబెట్టారు. అంతే కాదు ఆమె తనయుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కు కూడా పొలిట్ బ్యూరోలో చోటు కల్పించారు. వంగలపూడి అనితకు కూడా ఇప్పుడు డబుల్ థమాకా. ఆమె ఇప్పటికే తెలుగుదేశం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు. తాజాగా ఆమెకు పొలిట్ బ్యూరోలో చోటు కల్పించారు. డీ కె సత్యప్రభ అసలు పార్టీలో ఉంటారా? ఉండరా అన్న అంశంపై క్లారిటీ లేదని పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఇటీవలే డీ కె ఆదికేశవులనాయుడి తనయుడు డీ కె శ్రీనివాస్ తిరుమలలో జగన్ తో భేటీ అయ్యారు. ఆయన పార్టీ మారతారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ తరుణంలో డీ కె సత్యప్రభ కు ఏకంగా జాతీయ ఉపాధ్యక్షరాలి పదవి ఇఛ్చారు.

ప్రతిపక్షంలో పార్టీ కోసం పోరాడేవారిని గుర్తించి పదవులు ఇవ్వాలి కానీ ఇలా ఒకే కుటుంబంలో, ఒక్కొక్కరికి రెండేసి పదవులు ఇవ్వటం ఏమిటో అర్ధం కావటం లేదని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు నామినేటెడ్ పోస్టుల ఇవ్వటానికి..రెన్యువల్స్ చేయటానికి చాలా మందికి చంద్రబాబు చుక్కలు చూపించారు. ఇప్పుడు మాత్రం పదవులు ఇచ్చి పనిచేయండి అని చెబుతున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే మాత్రం చంద్రబాబు 'లెక్కలు' ఎప్పటిలాగానే మారిపోతాయి. పని చేయటానికి ఒకరు..పదవులు అనుభవించటానికి మాత్రం ఒకరు అన్న విధంగా చంద్రబాబు వ్యవహరిస్తారని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో మంత్రులుగా పనిచేసి ఓ వెలుగు వెలిగిన నారాయణ, పత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాసరావు వంటి వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు.

Next Story
Share it