Telugu Gateway
Telugugateway Exclusives

పవన్ కళ్యాణ్..మెగా కృష్ణారెడ్డి కొత్త దోస్తానా ఏంటో?!

పవన్ కళ్యాణ్..మెగా కృష్ణారెడ్డి కొత్త దోస్తానా ఏంటో?!
X

ఏపీ రాజకీయాల్లో ఇది ఓ సరికొత్త కలయిక. ఇది కూడా ఓ తరహా ఆథ్యాత్మిక రాజకీయమా? లేక పోతే కేవలం దైవ దర్శనమేనా?. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మెగా కృష్ణారెడ్డి కొత్త దోస్తానా ఆసక్తికరంగా మారింది. తెలుగుదేశం అధికారంలో ఉండగా విజయవాడ కేంద్రంగా ఉండే లింగమనేని ఎస్టేట్స్ కు చెందిన లింగమనేని రమేష్ తో కలసి విజయవాడ దగ్గర్లో నిర్మించిన వెంకటేశ్వరస్వామిని సందర్శించుకున్నారు పవన్ కళ్యాణ్. లింగమనేని రమేష్, పవన్ కళ్యాణ్ దోస్తీపై వైసీపీ రకరకాల విమర్శలు చేసింది. ఇప్పుడు ఆకస్మాత్తుగా పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోనే ప్రముఖ సంస్థగా ఉన్న మెగా ఇంజనీరింగ్ అధినేత మెగా కృష్ణారెడ్డి తో కలసి డోకిపర్రులోని వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఈ ఆలయ సందర్శన కోసమే శనివారం ఉదయం పవన్ కళ్యాణ్, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ లు హైదరాబాద్ నుంచి విజయవాడ బయలుదేరి వెళ్లారు.

వీరికి డోకిపర్రులోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో మెగా కృష్ణారెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని కట్టించింది కూడా మెగా కృష్ణారెడ్డే. ఆలయం దర్శనం కోసం ప్రత్యేకంగా వెళ్ళటం, వీరికి మెగా కృష్ణారెడ్డి స్వాగతం పలకటం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే జనసేన వర్గాలు మాత్రం ఇందులో ఎలాంటి రాజకీయ అంశాలు లేవని..ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ దేవాలయాన్ని సందర్శించాలనుకుంటున్నారని..ఇప్పటికి వీలు కుదిరిందని చెబుతున్నారు. అంతే కాదు డోకిపర్రు ఆలయం బ్రహ్మోత్సవాల కోసం మెగా కృష్ణారెడ్డి ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నారని..అంతే తప్ప..ఇందులో ఎలాంటి ప్రత్యేకత లేదని చెబుతున్నారు.

Next Story
Share it