పవన్ కళ్యాణ్ కే 'ఎర్త్' పెట్టిన సోము వీర్రాజు?!
పొమ్మనలేక పొగబెడుతున్నారా?
అమరావతిలో హ్యాండ్..ఇప్పుడు ఏకంగా బీసీ సీఎం ప్రకటన
బీసీ సీఎం వ్యాఖ్యల మతలబు ఏంటి?
ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ఏకంగా తమ భాగస్వామ్య పార్టీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కే ఎర్త్ పెడుతున్నట్లు కన్పిస్తున్నారు. బిజెపి-జనసేన ఇంకా మరికొంత మంది చేరినా ప్రస్తుతానికి అయితే ఏపీలో ఆ కూటమి అధికారంలోకి వచ్చే ఛాన్స్ లు కనుచూపు మేర కన్పించటం లేదు. కానీ ఇఫ్పటివరకూ ప్రతి చోటా బిజెపికి మద్దతు ఇవ్వటం తప్ప ఆ పార్టీ నుంచి ఏమీ తీసుకోని పవన్ కళ్యాణ్ ను బిజెపి అసలు ఏ మాత్రం పరిగణనలోకి తీసుకున్నట్లు కన్పించటం లేదు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలోనూ సీటు బిజెపికే ఫిక్స్ అయిపోయింది. తొలుత దీని కోసం పట్టుబట్టిన జనసేన తర్వాత ఎందుకో వదిలేసుకుంది. ఈ చర్చల సమయంలోనే పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్ధిగా ప్రకటించాలంటూ కొంత మంది జనసేన నేతలు వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ ప్రతి సమావేశంలోనూ జనసేన కార్యకర్తలు సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తుంటారు.
ఈ తరుణంలో బిజెపితో కలసి సాగుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఏ మాత్రం మింగుడపడని రీతిలో తాము అధికారంలోకి వస్తే బీసీకి సీఎం పదవి ఇస్తామంటూ కలకలం రేపారు సోము వీర్రాజు. అసలు అది జరుగుతుందా లేదా అన్న సంగతి పక్కన పెడితే ఆయన ప్రకటన మాత్రం బిజెపి-జనసేన కూటమిపై తీవ్ర ప్రభావం చూపించటం ఖాయంగా కన్పిస్తోంది. అమరావతి విషయంలోనూ పవన్ కళ్యాణ్ ఒకటి చెపితే...సోము వీర్రాజు మరొకటి చెప్పేవారు. అసలు వీరిద్దరి కలయికకు బలమైన కారణాలు ఏమీ కూడా కన్పించవు. ప్రత్యేక హోదా ఇవ్వలేదని బిజెపితో పొత్తు తెగతెంపులు చేసుకున్న పవన్ కళ్యాణ్ తర్వాత మళ్ళీ అమరావతి పేరుతో ఆ పార్టీతో పొత్తుకు వెళ్లారు. కానీ అదీ లేదు. ఏదీ లేదు. ఇప్పుడు చివరకు తాము అధికారంలోకి వచ్చినా కూడా సీఎం మాత్రం బీసీ అభ్యర్ధి అని చెప్పటం ద్వారా జనసేనకు, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు షాకిచ్చారని చెప్పొచ్చు. మరి దీనిపై జనసేన ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.