ఆర్ఆర్ఆర్ విడుదల మళ్ళీ వాయిదా?!
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్ దసరాకు కూడా ప్రేక్షకుల ముందుకు రావటం అనుమానంగానే ఉంది. ఇది పాన్ ఇండియా సినిమా కావటంతోనే ఈ కష్టాలు అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. కొద్ది రోజుల క్రితమే రెండు పాటల మినహా సినిమా షూటింగ్ అంతా పూర్తి అయిందని ప్రకటించి..అక్టోబర్ 13న సినిమా విడుదల చేయనున్నట్లు వెల్లడించింది చిత్ర యూనిట్. దసరాకు ఆర్ఆర్ఆర్ కు కావాల్సినంత స్పేస్ ఇచ్చేందుకు వీలుగా పలు పెద్ద పెద్ద సినిమాల విడుదల తేదీలు కూడా మార్చుకున్నారు. కానీ ఇప్పుడు అది కూడా ముందుకు సాగే సూచనలు కన్పించటం లేదని అంటున్నారు. ఇందుకు పలు అంశాలను ఉదహరిస్తున్నారు. డెల్టా వేరియంట్ కారణంతో మహారాష్ట్రలో దసరాకు కూడా థియేటర్లు పూర్తి స్థాయిలో తెరవటం కష్టం అవుతుందనే అంచనాలు ఉన్నాయి. దీంతోపాటు అత్యంత కీలక మార్కెట్ అయిన అమెరికాలోనూ కరోనా కేసులు గణనీయంగా పెరుగుతుండటం వంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు. రాజమౌళి సినిమాలకు భారీ మార్కెట్ ఉంటుందనే విషయం తెలిసిందే. అయితే అన్ని చోట్ల అనుకూల వాతావరణం ఉన్న సమయంలోనే ఇది సాధ్యం అవుతుంది.
కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని..దసరా నాటికి అంతా గాడిన పడుతుందనే సంకేతాలు కూడా లేవని చెబుతున్నారు. అందుకే ఆర్ఆర్ఆర్ టీమ్ డిసెంబర్ లేదా సంక్రాంతికి సినిమా విడుదల చేయాలని యోచిస్తుండగా..టాలీవుడ్ మొత్తం ఏకమై రాజమౌళికి అడ్డం తిరుగుతోందని సమాచారం. ఇప్పటికే పలుమార్లు ఆర్ఆర్ఆర్ విడుదల తేదీల కారణంగా తమ సినిమాల విషయంలో సర్దుబాట్లు చేసుకున్నామని..ఈ సారి అది సాధ్యం కాదని తేల్చిచెబుతున్నారు. ఎందుకంటే పెద్ద సినిమాల తేదీలు ఇప్పటికే ఫిక్స్ అయ్యాయి. అందులో ఎవరూ వాటిని మార్చుకోవటానికి సిద్ధంగా లేరు. ఈ లెక్కన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల వచ్చే ఏడాది వేసవికే అంటున్నారు. ఇదే జరిగితే ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు తమ అభిమాన హీరోల సినిమా చూసేందుకు మరింత కాలం వేచిచూడాల్సిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.