Telugu Gateway
Telugugateway Exclusives

త్వరలో బిజెపిలోకి రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్?!

త్వరలో బిజెపిలోకి రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్?!
X

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీ వీ రమేష్ త్వరలోనే బిజెపిలోకి చేరబోతున్నారా?. అంటే ఔననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. పీ వీ రమేష్ అప్పుడప్పుడు ట్విట్టర్ ద్వారా సామాజిక అంశాలపై కూడా స్పందిస్తుంటారు. ఒకసారి సలహాదారుగా ఉండగా ఆయప చేసిన ట్వీట్ కొద్దిపాటి దుమారమే రేపింది. తాజాగా 'నేరమే అధికారం అయితే..అది ప్రజలను వెంటాడుతుంది. ఊరక కూర్చున్ననోరున్న వాడూ నేరస్థుడే' అంటూ వరవరరావు చేసిన ట్వీట్ ను ఆయన రీట్వీట్ చేశారు. ఇది కూడా పెద్ద దుమారమే రేపింది. పలు సమస్యలపై స్పందించే గుణం ఉన్న రమేష్ కు రాజకీయాల్లోకి రావాలనే యోచనలో ఇలా చేస్తున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో పట్టుపెంచుకోవాలని బిజెపి ప్రయత్నాలు చేస్తోంది. అవి ఏ మేరకు సఫలం అవుతాయనే అంశం కాసేపు పక్కన పెడితే కీలక బాధ్యతల్లో ఉండి పదవి విరమణ చేసిన ఐఏఎస్ లపై ఆ పార్టీ ఫోకస్ పెట్టింది.

అందులో భాగంగానే పీ వీ రమేష్ ను పార్టీలోకి ఆహ్వానించే యోచనలో ఉందని..అందుకు ఆయన కూడా సుముఖత చూపే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ఏపీలో ఎంపీ అభ్యర్ధుల ఎంపిక రాష్ట్రంలోని అన్ని పార్టీలకు పెద్ద సవాల్ తో కూడుకున్న వ్యవహారమే. ఇప్పటికే రాష్ట్రంలో ఎంతో పట్టున్న పార్టీలు కూడా ఎంపీ అభ్యర్ధుల కోసం నానా తిప్పలుపడాల్సిందే. అందుకే బిజెపి రిటైర్డ్ ఐఏఎస్ ల వైపు దృష్టి సారించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే మరో రిటైర్డ్ అధికారి దాసరి శ్రీనివాసులు బిజెపిలోనే ఉన్నారు. తిరుపతి లోక్ సభ సీటు ఆయనకే ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయనతోపాటు కర్ణాటక మాజీ సీఎస్ రత్నప్రభ కూడా ఈ రేసులో ఉన్నట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి.

ఇక పీవీ రమేష్ విషయానికి వస్తే నిన్న మొన్నటి వరకూ ఏపీలోని జగన్ సర్కారులో సలహాదారుగా వ్యవహరించారు. అక్కడ వరస పెట్టి అవమానాలు జరగటంతో బయటకు వచ్చేశారు. సలహాదారు పదవి ఇచ్చినా ఆ తర్వాత ఆయన దగ్గర నుంచి కీలక సబ్జెక్ట్ లు తొలగించారు. ఆ తర్వాత పూర్తిగా సబ్జెక్ట్ లు అన్నీ తీసేసి సలహాదారు పదవికే పరిమితం చేశారు. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చారు. పరిపాలనా పరంగా పీ వీ రమేష్ లాంటి వ్యక్తులకు ఉన్న అనుభవాలను పార్టీకి ఉపయోగించుకోవటంతోపాటు...వచ్చే ఎన్నకల్లో రాష్ట్రం నుంచి ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దింపాలనే యోచనలో బిజెపి ఉందని చెబుతున్నారు.

Next Story
Share it