రాజమౌళిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ గరం గరం!
దర్శక దిగ్గజంగా పిలుపుచుకునే ఎస్ ఎస్ రాజమౌళిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ గరం గరం అవుతున్నారు. ఆరు నెలల కళ్లు కాయలు గా వేచిచూసిన తర్వాత విడుదల చేసిన రామరాజు ఫర్ భీమ్ వీడియో కాపీ విమర్శలు ఎదుర్కోవటం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను చికాకు కు గురిచేసింది. 1.32 నిమిషాల వీడియోలో రెండు సీన్లు కాపీ కొట్టినట్లు ఈ వీడియో విడుదల అయిన గంటల్లోనే సోషల్ మీడియాలో దుమారం రేగటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాజమౌళిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అగ్నిపర్వతం సీన్ తోపాటు అడవులకు సంబంధించిన సీన్లు కాపీ కొట్టినట్లు ఆధారాలతో సహా సోషల్ మీడియాలో రాజమౌళి పరువుతీసి పడేశారు. అంతేకాదు ఎన్టీఆర్ టోపీ పెట్టుకున్న సీన్ ఇప్పటికే 'జనతా గ్యారేజ్ 'లోనే బాగా పాపులర్ అయింది. ఇవన్నీ ఇప్పటికే చూసినవి కావటంతో భీమ్ పాత్ర కోసం ఎన్టీఆర్ ఎంతో కష్టపడి చేసిన సన్నివేశాలు అన్నీ చర్చను పక్కదారి పట్టించాయని..దీనికి రాజమౌళినే కారణం అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ఒక్క రోజులోనే భీమ్ పాత్ర పరిచయ వీడియోకు ఏకంగా 15 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇద్దరు ప్రముఖ హీరోలను పెట్టి మల్టీస్టారర్ సినిమా అంటేనే చాలా పెద్ద రిస్క్ అని..ఇలాంటి తేడాలు చేస్తే భవిష్యత్ లో చాలా సమస్యలు వస్తాయని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ వాయిస్ తో వచ్చిన రామ్ చరణ్ పాత్ర పరిచయానికి చెందిన భీమ్ ఫర్ రామరాజ్ వీడియోపై ఎలాంటి వివాదాలు లేవని..అది ఎంతో బాగా వచ్చిందని..కానీ ఆరు నెలలు ఆలశ్యం చేసి కూడా భీమ్ పాత్రను వివాదాల్లోకి నెట్టడం సరికాదని వీరు వ్యాఖ్యానిస్తున్నారు. సోషల్ మీడియాలో కాపీ షాట్లపై తీవ్ర ట్రోలింగ్ జరిగినా కూడా చిత్ర యూనిట్ నుంచి మాత్రం స్పందన లేదు. దీనికి తోడు ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ వ్యవహారంపై సీరియస్ అవటంతో కొత్త తలనొప్పి స్టార్ట్ అయినట్లు అయింది. మూడు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ అని చెబుతూ ఒకటిన్నర నిమిషం కూడా లేని వీడియోలో ఇన్ని లోపాలు పెట్టడం ఏంటి అనేది ఎక్కువ మంది ఫ్యాన్స్ ఆందోళనగా ఉంది. ఓ వైపు చారిత్రక నేఫథ్యం ఉన్న కొమరం భీమ్ పాత్ర వక్రీకరణల విమర్శలు ఓ వైపు దుమారం రేపుతుండగా...ఇప్పుడు కొత్త సమస్యలు రావటం చర్చకు దారితీస్తోంది.