Telugu Gateway
Telugugateway Exclusives

స‌ర్కారు యాడ్ లో 'సాక్షి' వార్త‌ల ప్ర‌మోష‌నా?!

స‌ర్కారు యాడ్ లో సాక్షి వార్త‌ల ప్ర‌మోష‌నా?!
X

ఏపీలో జ‌గ‌న్ స‌ర్కారు ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌ల విష‌యంలో ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త పుంత‌లు తొక్కుతూనే ఉంది. ఓ వైపు ఆర్ధిక క‌ష్టాలు ఉన్నాయంటూ బ‌హిరంగంగా అంగీక‌రిస్తూనే సీఎం జ‌గ‌న్ ఫ్యామిలీకి చెందిన ప‌త్రిక‌కు కోట్ల రూపాయ‌ల ప్ర‌క‌ట‌న‌లు కుమ్మ‌రిస్తూనే ఉంది. గ‌త మూడేళ్లుగా ఈ వ్య‌వ‌హ‌రం సాగుతోంది. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక ప్ర‌భుత్వంపై ఎవ‌రైనా త‌ప్పుడు వార్త‌లు రాస్తే కేసులు పెడ‌తామ‌ని హెచ్చ‌రించారు. అంతే కాదు ఏకంగా జీవో 2430 తీసుకొచ్చారు. ఇటీవ‌ల ఈనాడు ప‌త్రిక ఏపీలో ఫించ‌న్లు స‌ర్కారు చెబుతున్న‌ట్లు ఒక‌టో తేదీనే అంద‌టంలేద‌ని..కొంత ఆల‌శ్యం అవుతున్నాయ‌ని ఓ వార్త రాసింది. నిజంగా ఆ వార్త‌పై ఏమైనా అభ్యంత‌రాలు ఉంటే స‌ర్కారు చెప్పిన‌ట్లు జీవో 2430 ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చు..లేదంటే వాస్త‌వాలు ఏమిటో వివ‌రించవ‌చ్చు. కానీ స‌ర్కారు మాత్రం ఈనాడు లో వ‌చ్చిన వార్త‌కు ఖండ‌న యాడ్స్ సొంత ప‌త్రిక సాక్షితో పాటు ఇంగ్లీషు ప‌త్రిక‌ల్లోనూ యాడ్స్ ఇచ్చింది. ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన వార్త‌ల‌కు ప్ర‌భుత్వాలు వివ‌ర‌ణ‌ల ద్వారా ఖండ‌న‌లు ఇస్తాయి కానీ..ఇలా యాడ్స్ ద్వారా ఖండ‌న‌లు ఇవ్వ‌టానికి జ‌గ‌న్ సీఎం అయిన త‌ర్వాతే వ‌చ్చింద‌ని చెప్పాలి. అస‌లు ఏ ప‌త్రిక కూడా ఆ ప్ర‌భుత్వం వార్త‌లు రాయ‌దు అనే ప‌రిస్థితి ఉన్న‌ప్పుడు ఇలాంటి చేస్తారేమో కానీ..ప్ర‌భుత్వం ఏ అంశంపై అయినా వివ‌ర‌ణ‌లు ఇస్తే వాటిని విస్మ‌రించే ప‌రిస్థితి ఉండ‌దు.

పైగా ఓ వైపు 2430 జీవో క‌త్తి వేలాడుతున్న స‌మ‌యంలో అంత సాహ‌సం ఎవ‌రూ చేయ‌రు. ఈనాడు వార్త‌కు తెలుగు, ఇంగ్లీషు ప‌త్రిక‌ల్లో ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌టం ఒకెత్తు అయితే సాక్షి ప‌త్రిక‌లో ఇచ్చిన యాడ్ లో మ‌రో హైలెట్ ఉంది. ఉప ముఖ్య‌మంత్రి బూడి ముత్యాల‌నాయుడు పేరుతో ఇచ్చిన ప్ర‌క‌ట‌న‌లో ఆయ‌న పేరు కింద పూర్తి వివ‌రాలు పేజీ 4 ఫ్యాక్ట్ చెక్ 'ఏది నిజం' లో అంటూ ప్ర‌స్తావించారు. ఇది సాక్షికి ప్ర‌త్యేకం అన్న‌ట్లు. సాక్షి రాసిన ఎడిట్ పేజీ క‌థ‌నానికి ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌కు అస‌లు సంబంధం ఏమిటి?. ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌లో ఇలా సాక్షి ప‌త్రిక క‌థ‌నం గురించి ఎలా ప్ర‌స్తావిస్తారు అని అధికారులు సైతం విస్మ‌యానికి గుర‌వుతున్నారు. ఖండ‌న‌ల‌కు ప్ర‌జ‌ల సొమ్ముతో యాడ్స్ ఇవ్వ‌ట‌మే విచిత్రం అయితే..అందులోనూ సాక్షి క‌థ‌నం గురించి స‌ర్కారు యాడ్ లో ప్ర‌స్తావించ‌టం అరాచ‌కానికి ప‌రాకాష్ట అని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

Next Story
Share it