శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు మెట్రో రైల్ ఓ బిగ్ స్కాం?!
అంచనా వ్యయం 5000 కోట్ల రూపాయల నుంచి 6250 రూపాయలకు పెంపు
ఏడాదిలోనే 1250 కోట్ల రూపాయల హై జంప్ ఎలా సాధ్యం?
అనుమానాలు వ్యక్తం చేస్తున్న అధికారులు !
ఇంకా అసలు పనులే మొదలు కాలేదు. సరిగ్గా ఏడాది క్రితం 5000 కోట్ల రూపాయలు ఉన్న శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైలు ప్రాజెక్ట్ అంచనా వ్యయం ఇప్పుడు ఏకంగా 6250 కోట్ల రూపాయలకు పెరిగింది. పోనీ ఏమైనా కిలో మీటర్ల సంఖ్య మారిందా అంటే అదే 31 కిలోమీటర్లు కానీ అంచనా వ్యయం మాత్రం అమాంతం 1250 కోట్ల రూపాయలు పెంచేశారు. అందుకే ఇది మరో స్కాం అన్న చర్చ అటు అధికార వర్గాలతో పాటు ఇన్ఫ్రా వర్గాల్లోనూ వ్యక్తం అవుతోంది. గత ఏడాది శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆపరేటర్ గా ఉన్న జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ లిమిటెడ్ తన యూజర్ డెవలప్మెంట్ చార్జీల ఖరారు కోసం ఎయిర్ పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ (ఏఈఆర్ఏ) కి నివేదిక అందచేసింది. యుడీఎఫ్ ఖరారు కోసం కంపెనీ పెట్టే పెట్టుబడులు, రాబడి అంచనాలు ఇస్తే వీటి ఆధారంగా యుడీఎఫ్ ఖరారు అవుతుంది. అందులో భాగంగానే జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు వేసే మెట్రో రైలు ప్రాజెక్ట్ 31 కిలోమీటర్ల కు 5000 కోట్ల వ్యయం అవుతుందని...అందులో తాము 10 శాతం వాటా కోసం 500 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా ప్రాజెక్ట్ కాస్ట్ ను ప్రభుత్వం 6250 కోట్ల రూపాయలుగా ప్రకటించింది.
అంతే కాదు ప్రభుత్వ నిధులతోనే ఈ పనులు చేపడతామని వెల్లడించింది. కేంద్రాన్ని ఇప్పటికే పలు మార్లు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్ ) కింద నిధులు ఇవ్వాల్సిందిగా కోరింది. కేంద్రం నిధులు ఇచ్చినా..ఇవ్వకపోయినా తాము పనులు చేస్తామని తెలంగాణ మంత్రి కెటిఆర్ వెల్లడించారు. ఆదివారం నాడే కెటిఆర్ ప్రాజెక్ట్ వ్యయం తో పాటు సీఎం కెసిఆర్ డిసెంబర్ 9 న ఈ ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేస్తారని ప్రకటించారు. ఒక వైపు నిధుల కటకట తో ఉన్న సర్కార్ సంక్షేమ కారక్రమాల అమలు కోసం రాష్ట్రమంతా భూములు అమ్ముతోంది. మరి ఇప్పుడు ఇంత భారీ ప్రాజెక్టును సొంత నిధులతో రాష్ట్ర ప్రభుత్వం చేయగలదా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వేళ కేంద్రం వీజీఎఫ్ ఇస్తే మాత్రం ప్రాజెక్ట్ అంచనాల అంశం కీలకంగా మారె అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. చూడాలి ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో. కొత్తగా నిర్మిస్తున్న సచివాలయం అంచనా వ్యయాలు కూడా పెరిగిన విషయం తెలిసిందే. తెలంగాణ సర్కారు సాగు నీటి ప్రాజెక్టులు..నీటి పైప్ లైన్ ప్రోజెక్టుల్లోనూ భారీగా అంచనాలు పెంచి అక్రమాలకు పాల్పడింది అనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇప్పుడు శంషాబాద్ మెట్రో ప్రాజెక్ట్ వంతు వచ్చింది.