చీలిక దిశగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ?!
ఎన్నికల తర్వాత కూడా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో ప్రకంపనలు ఆగటం లేదు. ఫలితాల వెల్లడి అనంతరం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మాలో చీలిక తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఫలితాల వచ్చిన తర్వాత ముందు నాగబాబు, ఆ తర్వాత ప్రెసిడెంట్ గా పోటీచేసి ఓడిపోయిన ప్రకాష్ రాజ్, మా మాజీ ప్రెసిడెంట్ నరేష్ పాలనలోని అక్రమాలపై విచారణ చేయించకపోతే తాను రాజీనామా చేస్తానంటూ షరతులతో కూడిన రాజీనామా శివాజీరాజా లేఖ పంపటం వంటి పరిణామాలు అన్నీ కూడా మావీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ను చీలిక దిశగా నడిపిస్తున్నాయనే పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. దీనికి తోడు ప్రకాష్ రాజ్ మంగళవారం నాడు చేసిన ట్వీట్ చీలిక చర్చకు మరింత బలం చేకూర్చేదిలా ఉంది. 'మా సభ్యత్వానికి రాజీనామా చేయటం వెనక లోతైన అర్ధం ఉందని..అది తర్వాత తెలియజేస్తానని వ్యాఖ్యానించారు ప్రకాష్ రాజ్. ' అంతే కాదు తనకు ఓటు వేసిన వారిని నిరాశపర్చనని, త్వరలోనే అన్నింటిని వివరిస్తానని పేర్కొన్నారు. ఓ వైపు మెగా క్యాంప్ ఈ ఫలితాలపై కుతకుతలాడుతోంది. పైకి మాత్రం ప్రస్తుతానికి మౌనాన్నే ఆశ్రయిస్తోంది. అయితే తాజాగా పెళ్లి సందడి సినిమా ప్రీరిలీజ్ వేడుకలలో మాట్లాడిన చిరంజీవి చిన్న చిన్న పదవుల కోసం గొడవపడడటం మంచిదికాదని..అందరూ కలసికట్టుగా పరస్పర సహకారంతో పరిశ్రమ ముందుకు సాగాలన్నారు. ఆదిపత్యం కోసం ఒకరిపై ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేసుకోవటం కరెక్ట్ కాదంటూ వ్యాఖ్యానించారు. చిరంజీవి వ్యాఖ్యలపై కూడా సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. అలా అయితే ముందు చెప్పాల్సింది మీ ఇంటి సభ్యుడు..నాగబాబుకు కదా అంటూ చాలా మంది చురకలు అంటించారు. మా ఎన్నికల సందర్భంగా నాగబాబు సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావుపై అనుచిత వ్యాఖ్యలు చేయటంతోపాటు ప్రకాష్ రాజ్ కోటి రూపాయలు తీసుకునే నటుడు అని..జాతీయ అవార్డు తెచ్చారని,,ప్రధాని మోడీని ఢీకొట్టగల వ్యక్తి అంటూ వ్యాఖ్యానించి కలకలం రేపారు.
ఎన్నికల్లో ఓట్లు అడగటం కాకుండా మా అభ్యర్ధి కాకుండా మీరు ఇంకెవరికి ఓట్లు వేస్తారో చూస్తాం అన్న చందంగా నాగబాబు వ్యవహరించిన తీరు ప్రకాష్ రాజ్ కు ఏ మాత్రం మేలు చేయకపోగా..భారీగానే నష్టం చేకూర్చింది. ఫలితాల అనంతరం మాట్లాడిన మోహన్ బాబు కూడా తనను రెచ్చగొట్టాలని చూస్తున్నారంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మెగా క్యాంప్ లోని కీలక హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు ఇప్పటికిప్పుడు మాకు రాజీనామా వంటి నిర్ణయాలు తీసుకోకపోయినా వెనక నుంచి కథ అంతా వాళ్లే నడిపిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే తాము మద్దతు ఇచ్చిన వ్యక్తి గెలవపోతే మాలో చీలిక తెచ్చే ప్రయత్నాలు చేస్తే అది వాళ్లకు లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తుంది అని ఓ ప్రముఖుడు వ్యాఖ్యానించారు. అయితే రాజీనామాలు చేసి..మా నుంచి విడిపోయే వారు ఏమి చేస్తారు..వారి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. ప్రకాష్ రాజ్ తన రాజీనామా వెనక 'లోతైన 'కారణాలు అనటం వెనక ఇదే ప్లాన్ అని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. అయితే మా కొత్త ప్రెసిడెంట్ మంచు విష్ణు మాత్రం ఎవరి రాజీనామాలు ఆమోదించేదిలేదని..ఆవేశం తగ్గాక త్వరలో ప్రకాష్ రాజ్, నాగబాబులతో మాట్లాడతానని ప్రకటించారు. మరి ఈ రాజీ ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో వేచిచూడాల్సిందే.