Telugu Gateway
Telugugateway Exclusives

కెటీఆర్ రివ‌ర్స్ గేర్!

కెటీఆర్ రివ‌ర్స్ గేర్!
X

టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కెటీఆర్ ఒక్క‌పూట‌లో రివ‌ర్స్ గేర్ వేశారు. ఆయ‌న చెప్పిన దాంట్లో ఏది నిజం?. ముందు చెప్పిన మాట‌లా..త‌ర్వాత చేసిన ట్వీటా?. ఏపీలో ప‌రిస్థితి అధ్వాన్నంగా ఉంద‌ని..నీళ్ళు లేవు..క‌రెంట్ లేదు..రోడ్ల‌న్నీ ధ్వంసం అయ్యాయంటూ క్రెడాయ్ స‌మావేశంలో వ్యాఖ్యానించారు. మౌలిక‌వ‌స‌తుల్లో హైద‌రాబాద్ బెస్ట్ అంటూ..ప‌క్క రాష్ట్రాల‌కు వెళ్లి చూసి రండి..నిజాలు మీకే తెలుస్తాయి అంటా వ్యాఖ్యానించారు. కెటీఆర్ వ్యాఖ్య‌లు మీడియాలో ప్ర‌ముఖంగా రావ‌టంతో ఒక్క‌సారిగా ఏపీలో రాజ‌కీయ దుమారం ప్రారంభం అయింది. కెటీఆర్ వ్యాఖ్య‌ల‌ను టీడీపీ వాడుకునే ప్ర‌య‌త్నం చేసింది. అంతే ..ఏపీ మంత్రులు అంద‌రూ మూకుమ్మ‌డిగా తెలంగాణ స‌ర్కారుపై ఎటాక్ చేశారు. ఎన్ని డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ళు క‌డ‌తామ‌న్నారు...ఎన్ని క‌ట్టారు. వ‌ర్షం వ‌స్తే హైద‌రాబాద్ మునిగే సంగ‌తి ఏంటి?. హైద‌రాబాద్ లో డ్ర‌గ్స్ సంగ‌తి ఏంటి?. కెసీఆర్.. కెటీఆర్ చెప్పేది ఒక‌టి..చేసేది ఒక‌టి అంటూ ఎదురుదాడి ప్రారంభించారు. తెలంగాణ మంత్రులు...ఎంపీలు కెటీఆర్ వ్యాఖ్య‌ల్లో త‌ప్పేమి ఉంది..ఆయ‌న నిజాలే మాట్లాడారంటూ స‌మ‌ర్ధించారు. సీన్ క‌ట్ చేస్తే శుక్ర‌వారం అర్ధ‌రాత్రి స‌మ‌యంలో మంత్రి కెటీఆర్ ఓ ట్వీట్ చేశారు.

క్రెడాయ్ స‌మావేశంలో తాను అన్యాప‌దేశంగా మాట్లాడానే త‌ప్ప‌...ఈ వ్యాఖ్య‌ల వెన‌క ఎలాంటి దురుద్దేశంలేద‌ని వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. త‌న వ్యాఖ్య‌ల వ‌ల్ల ఏపీలోని కొంత మంది స్నేహితుల‌కు బాధ క‌లిగి ఉండొచ్చ‌న్నారు. ఏపీ సీఈఎం జ‌గన్ ను తాను సోద‌ర స‌మానుడిగా భావిస్తాన‌ని..ఆయ‌న నాయ‌క‌త్వంలో ఆ రాష్ట్రం మ‌రింత అభివృద్ధి చెందాల‌ని మ‌న‌సారా కోరుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు. దీంతో కెటీఆర్ ముందు చెప్పింది నిజ‌మా? లేక ట్వీట్ లో చెప్పింది నిజ‌మా అన్న చ‌ర్చ సాగుతుంది. కెటీఆర్ ది అంతా క‌వ‌ర‌ప్ యాక్టివిటినే అంటున్నారు. ఎందుకంటే ఏ రాష్ట్రం అయినా విద్యుత్, రోడ్లు వంటి మౌలిక‌స‌దుపాయాలు స‌రిగా లేకుండా అభివృద్ధి చెంద‌టం ఎలా సాధ్యం అవుతుంది?. ముందు ఆ మాట మాట్లాడి త‌ర్వాత జ‌గ‌న్ నాయ‌క‌త్వంలో రాష్ట్రం మ‌రింత అభివృద్ధి చెందుతుంద‌ని మ‌న‌సారా కోరుకుంటున్నా అన‌టంలో మ‌ర్మం ఏమిట‌నే సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. మీరు ఇలాగే చేసుకోండి..మేం అలాగే ముందుకెళ‌తాం అన్న‌ట్లు ఉంద‌ని ఓ నేత వ్యాఖ్యానించారు.

Next Story
Share it