వాళ్లు అనుకున్నది ఒకటి..అయిందొకటి
సెప్టెంబర్ లో జరిగిన అసెంబ్లీ సమావేశాలను జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఉపయోగించుకున్నారు. ఒక రోజు ప్రత్యేకంగా జీహెచ్ఎంసీ అభివృద్ధిపై చర్చ పెట్టారు. అందులోనే అరవై ఏడు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం. లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వబోతున్నాం అంటూ ప్రకటించారు. కరోనా టైమ్ లో కొన్ని చోట్ల హడావుడిగా బస్తీ దవాఖానాలు తెరిచారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో రహదారులు...ఇతర పనులు పూర్తి చేశారు. వీటిని చూపి జీహెచ్ఎంసీ ఎన్నికల్లోమరోసారి జెండా ఎగరేయాలని ప్లాన్ చేశారు. కానీ అక్టోబర్ లో కురిసిన వర్షాలు ఈ ప్లాన్స్ అన్నింటికి బ్రేక్ లు వేశాయి. ఇంత కాలం ముఖ్యమంత్రి కెసీఆర్, పురపాలక శాఖ మంత్రి కెటీఆర్ లు చెబుతున్న అభివృద్ధి కంటే ఈ వర్షాలు..వరదలు చూపించిన ప్రభావం ప్రజల్లో బలంగా నాటుకుపోయేలా ఉంది. అయితే ఇది జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పటం కష్టం కాని అధికార టీఆర్ఎస్ అభివృద్ధి ప్రచారానికి మాత్రం ఝలక్ ఇచ్చిందనే చెప్పాలి.
తెలంగాణ వచ్చిన కొత్తలోనే ముఖ్యమంత్రి కెసీఆర్ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ సమైక్య పాలకులు..ఆంధ్రా పాలకుల వల్లే వర్షం వస్తే చాలు అసెంబ్లీ ముందు, రాజ్ భవన్ ముందు మోకాళ్ళపైనే నీరు పారుతుందంటూ విమర్శలు చేశారు. ఇదా వీళ్ళు మనకు చేసిన అభివృద్ధి అంటూ మండిపడ్డారు. కానీ ఏడేళ్లు కావస్తోంది. కెసీఆర్ చెప్పిన ఈ రెండు చోట్ల అంటే అసెంబ్లీ, రాజ్ భవన్ ల దగ్గర ఇప్పుడు గతంలో కంటే వరద నీరు ఎక్కువగా ప్రవహిస్తోంది కానీ ఏ మాత్రం మార్పు లేదు. సమైక్యపాలకులకు చేతకానిది చేసి చూపిస్తానన్న మాట అడుగు ముందుకు పడలేదు. దీంతోపాటు పాతబస్తీని ఇస్తాంబుల్ చేస్తా...ఇంకేదో చేస్తా అంటూ సీఎం కెసీఆర్ చేసిన ప్రకటనలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్ లు సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతున్నాయి. తాజాగా కురిసిన వర్షాలు..వచ్చిన వరదలు జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు ప్రతిపక్షాలకు అస్త్రాలుగా మారటం ఖాయం. అయితే ప్రభుత్వం చెబుతున్నట్లు 67 వేల కోట్ల రూపాయల అభివృద్ధి ఎక్కడా కన్పించదు. కరోనా విషయంలో కూడా వైరస్ వచ్చిన తొలి రోజుల్లో ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు సర్కారు తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
టెస్ట్ ల విషయంతోపాటు ప్రైవేట్ ఆస్పత్రుల ఫీజుల దోపిడీని అరికట్టడంలో ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. సాక్ష్యాత్తూ తెలంగాణ హైకోర్టు పలుమార్లు సర్కారుపై గతంలోఎన్నడూలేని రీతిలో విమర్శలు చేసింది. తాజాగా జరిగిన విచారణలోనూ అదే పరిస్థితి రిపీట్ అయింది. తెలంగాణ సర్కారు చెప్పిన కరోనా లెక్కలపై ప్రజల్లో కూడా పలు అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా మరణాల విషయంల. అయితే ఈ అంశాలు అన్నింటిని పరిగణనలోకి తీసుకునే వారు జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ఓటింగ్ కు వెళతారా?. ఆ ప్రభావం ఈ ఎన్నికల్లో పడుతుందా అంటే వేచిచూడాల్సిందే. ఏది ఏమైనా విపక్షాలకు మాత్రం జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ చేతికి పలు అస్త్రాలు అందుతున్నాయి. అయితే వీటిని వారు ఎలా ఉపయోగించుకుంటున్నారన్నది ఫలితాలే వచ్చాక కానీ తెలియదు. తాజా వరదల ప్రభావం ప్రజల మనసుల నుంచి పోయేందుకు ఎన్నికలను కొత్త సంవత్సరంలోకి జరుపుతారా? లేక ముందు ప్రకటించినట్లుగా నవంబర్-డిసెంబర్ ల్లో జరిపిస్తారా అన్నది తేలాల్సి ఉంది.