నాడు కౌగిలింతలు...నేడు కుతకుతలు
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టుపై నిప్పులు చెరిగారు. అప్పటి సీఎం చంద్రబాబు కేసుల కోసం రాజీపడి ఏపీని ఏడారి చేస్తున్నారంటూ మండిపడ్డారు. సీన్ కట్ చేస్తే సీఎం అయిన తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి తాను స్వయంగా కాళేశ్వరానికి వ్యతిరేకంగా దీక్షకు దిగి..ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. అంతే కాదు..తెలంగాణ సీఎం కెసీఆర్ తో కలసి ఓ భారీ ప్రాజెక్టు తలపెట్టి.. దీన్ని ముందుకు తీసుకెళ్ళేందుకు చర్చలు కూడాజరిపాయి. ఆ సమయంలోనే సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా సీఎం కెసీఆర్ ఉంతో ఉదారంగా ఉన్నారని..ఎందుకు ఆయనతో గొడవలు పడాలని ప్రశ్నించారు. ఇక తెలంగాణ సీఎం కెసీఆర్ విషయానికి వస్తే ఓ మీడియా సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నలపై మండిపడుతూ మీ ఉద్దేశం ఏంటో నాకు తెలుసు...మా ఇద్దరి మధ్య (జగన్ తో) గొడవలు పెట్టాలనే మీ ఆటలు సాగవు ఇక్కడ అంటూ మండిపడ్డారు. అంతే కాదు..ఓ సారి ఏపీ పర్యటనకు వెళ్లిన కెసీఆర్ రాయలసీమను రతనాల సీమగా మారుస్తామంటూ ప్రకటించారు. ఇదే కెసీఆర్, కెటీఆర్, టీఆర్ఎస్ నేతలు గతంలో జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన వారే. ఏపీలో జగన్ అధికారంలోకి రావటంతో అకస్మాత్తుగా ఆ బంధం మారిపోయింది. రెండు రాష్ట్రాల ప్రజలు కూడా సరే గొడవలకు బ్రేక్ పడితే అంతకంటే కావాల్సింది ఏముంది అనుకున్నారు. కానీ అకస్మాత్తుగా తెలంగాణ సర్కారు కత్తులు దూయటం ప్రారంభించింది.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు కు జీవో ఇచ్చి..టెండర్లు పిలిచినప్పుడే తెలంగాణలో విపక్ష పార్టీలు గగ్గోలు పెట్టాయి. ఈ సమయం ఎప్పుడేమి చేయాలో కెసీఆర్ కు తెలుసు అంటూ అధికార టీఆర్ఎస్ కౌంటర్ ఎటాక్ ఇచ్చి వదిలేసింది. ఇద్దరు పెద్దలకు కావాల్సిన కంపెనీకి ప్రాజెక్టు కట్టబెట్టేందుకే అప్పటివరకూ మౌనం వహించారనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి. కానీ సీఎం కెసీఆర్ అకస్మాత్తుగా కొద్ది రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తి జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. అప్పటి నుంచి ఇక తెలంగాణ మంత్రులు మరింత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించటం ప్రారంభించారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిపై పరుష పదజాలంతో మాట్లాడినా కూడా వైఎస్ఆర్ సీపీ నుంచి సీఎం జగన్ నుంచి వచ్చిన స్పందన ఆ పార్టీ నేతల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఎంతటి సంక్లిష్ట సమస్య అయినా కూర్చుని మాట్లాడుకుంటేనే పరిష్కారం అవుతుంది. ఇప్పటికే ఎవరికెంత నీటి కేటాయింపులు అనేది నిర్ధారించేశారు.
రెండు రాష్ట్రాల మధ్య వివాదం తెగకపోతే తేల్చాల్సింది కేంద్రం, రివర్ బోర్డులు. కానీ ఒకరిపై ఒకరు దూషణలకు దిగి ఉద్రికత్తలు రెచ్చగొట్టడం వల్ల ఎవరికి ప్రయో జనం?. ఏపీ సీఎం జగన్ బుధవారం నాడు కేబినెట్ లో చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలు మరింత వింతగా ఉన్నాయి. తెలంగాణలో ఏపీ ప్రజలు ఉన్నారనే సంయమనంగా ఉన్నామని వ్యాఖ్యానించటం ద్వారా సీఎం జగన్ తన డొల్లతనాన్ని బహిర్గతం చేసుకున్నారని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఏపీ ప్రజలు కొత్తగా వచ్చినవారేమీ కాదుగా. అయినా తెలంగాణ ఉద్యమం పీక్ లో సాగిన రోజుల్లోనే కొంత ఓవర్ యాక్షన్ చేసిన వారికి తప్ప ఎవరికీ పెద్దగా ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అలాంటిది ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఏపీ ప్రజలకు కొత్తగా వచ్చే ఇబ్బంది ఏమి ఉంటుంది? . అయినా ఓట్లు వేసి గెలిపించి అధికారం అప్పగిస్తే పాలకులు వివాదాలు పెట్టుకుని ప్రజలను ఇబ్బందుల్లోకి నెడతారా?. చంద్రబాబుకు, కెసీఆర్ కు అంటే ఏదో రాజకీయ వైరం ఉంది. మరి ఇద్దరు సీఎంలు ఒకరినొకరు కౌగిలించుకుని.. ఇద్దరూ ఒకరింట్లో ఒకరు విందులు ఆరగించి ఇప్పుడు మాట్లాడుకోకుండా ఎందుకు పోట్లాడుకుంటున్నట్లు?. ఇది రాజకీయం కాదా?.