జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపి, జనసేన కలసి పోటీ
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం
అత్యంత ప్రతిష్టాత్మకమైన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ సారి రాజకీయం రంజుగా మారబోతోంది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ కు పలు ప్రతికూల సంకేతాలు ఎదురవుతున్నాయి. ఈ తరుణంలో రాజకీయంగా అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ సారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపి, జనసేన కలసి పోటీచేయనున్నాయి. ఈ మేరకు నిర్ణయం జరిగిపోయింది. జనసేన సొంతంగా పోటీచేస్తే పెద్దగా ప్రభావం చూపించలేకపోవచ్చు కానీ..బిజెపితో కలసి పోటీచేస్తుంది కాబట్టి ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని చెప్పకతప్పదు. దీనికి ప్రధాన కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు చెందిన సినీ గ్లామరే కారణం. సహజంగానే గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో బిజెపికి బలం ఎక్కువ. ఇప్పటికే బిజెపి జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్ పెట్టి పనిచేస్తోంది. దీనికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గ్లామర్ కూడా జత కానుంది.
కొద్ది రోజులుగా జనసేన జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కసరత్తు ప్రారంభించింది. ముఖ్యంగా మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని పలు డివిజన్లను ఇప్పటికే కమిటీలను కూడా ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ కమిటీలు ఇప్పటికే రంగంలోకి దిగి వరద సహాయక పనులను కూడా పర్యవేక్షిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో జనసేన జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన కసరత్తు చేస్తోంది. ఖచ్చితంగా ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గ్లామర్ కు ఓట్లు పడతాయి..ఆ ప్రభావం ఉంటుందనే అంశాలను గుర్తించి దాని ప్రకారమే సీట్ల సర్దుబాటు కూడా చేసుకోనున్నారు. బిజెపి, జనసేన ఇద్దరూ కలసి పోటీచేస్తున్నందున పవన్ కళ్యాణ్ కూడా ప్రచార బరిలో ఉండటం ఖాయం.
గత కొంత కాలంగా అధికార టీఆర్ఎస్ తో అంటే ముఖ్యంగా సీఎం కెసీఆర్, మంత్రి కెటీఆర్ తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు. మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఈ సంబంధాలు ఎలా ఉంటాయన్నది కీలకంగా మారింది. ఎందుకంటే మరోసారి ఎలాగైనా జీహెచ్ఎంసీపై జెండా ఎగరేయాలని టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. జీహెచ్ఎంసీతోపాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బిజెపి, జనసేన పొత్తు కొనసాగనుంది. అయితే బిజెపి నేతలు దుబ్బాక ఉప ఎన్నికలో కూడా పవన్ కళ్యాణ్ ను ప్రచారానికి దింపాలనే ప్రతిపాదనలో ఉన్నారు. మరి దీనికి పవన్ రెడీ అవుతారా లేదా అన్నది వేచిచూడాల్సిందే. అధికార టీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ముఖ్యంగా కాంగ్రెస్ కంటే బిజెపినే ఎక్కువగా టార్గెట్ చేస్తోంది. ఈ తరుణంలో బిజెపి తరపున పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగితే రాజకీయంగా మరింత ఆసక్తికరంగా మారటం ఖాయం.