Telugu Gateway
Telugugateway Exclusives

అదే నిజం అయితే ప్రపంచ సంచలనమే

అదే నిజం అయితే ప్రపంచ సంచలనమే
X

తెలంగాణ లోని కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీటి ప్రవాహం ఏమో కానీ...బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నోటి వెంట మాత్రం అబద్దాల ప్రవాహం అలవోకగా సాగుతోంది. ఎన్నికల వేళ ఈ అబద్దాల ప్రవాహం కాళేశ్వరం నీళ్ల కంటే మరింత వేగంగా సాగే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించి సోమవారం నాడు సీఎం కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపుతున్నాయి. అందులో మచ్చుకు కొన్ని‘వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడి రిటర్న్ వచ్చింది. రిటర్న్ వస్తనే ఉంది. 80 వేల కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే ఎప్పుడో తీరి (తేలి)పోయింది దాని బాకీ. పంటలు పండితే ఒక్కోసారి మూడు మూడు కోట్ల టన్నులు పండుతున్నాయి. ఇండియా లోనే నంబర్ వన్ స్టేట్ తలసరి ఆదాయంలో. దీనికోసమే తెలంగాణ తెచ్చుకున్నాం. ’ అంటూ కెసిఆర్ సంచలన ప్రకటన చేశారు. నిజంగా సీఎం కెసిఆర్ చెప్పినట్లు 80 వేల కోట్ల రూపాయల బాకీ పంటలతో తీరిపోతే అది ఒక ప్రపంచ సంచలనమే అవుతుంది అని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. అయన చెప్పినట్లు కాళేశ్వరంతో రైతులకు అంత సంపద వచ్చిపడితే ధాన్యానికి గిట్టుబాటు ధర కోసం వాళ్ళు ఎందుకు రోడ్డు ఎక్కుతున్నారు. మరి అలాంటప్పుడు సీఎం కెసిఆర్ రైతులకు రైతు బంధు ఇవ్వాల్సిన అవసరం ఉందా...అయన చెప్పినట్లు 80 వేల కోట్ల సంపద వస్తే ఇక రైతు రుణ మాఫీ ఎందుకు?. అంత సంపద వచ్చిన రైతులనే సాయం అడిగి సీఎం కెసిఆర్ బ్యాంకు ల నుంచి అధిక వడ్డీకి తీసుకు వచ్చిన రుణాలను కూడా తీర్చ వచ్చు అని ఒక ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్,దీని అవినీతిపై వస్తున్న విమర్శలను కప్పిపుచ్చేందుకు సీఎం కెసిఆర్ ఇప్పుడు కాళేశ్వరం కట్టిన 80 వేల కోట్ల రూపాయలు వచ్చాయని కొత్త రాగం..కొత్త అబద్దం అందుకున్నారు అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడానికి తెచ్చిన అప్పు, దాని నిర్వహణ కు అయ్యే విద్యుత్ భారం అసలు ఎప్పటికి తీరతాయో ఎవరికీ తెలియదు అని...ఈ విషయాలన్నీ పక్కన పెట్టి ఎన్నికల వేళ కెసిఆర్ ప్రజలను మోసం చేసేందుకు కాళేశ్వరం కట్టిన డబ్బులు వచ్చాయని చెపుతున్నారు అని...చూస్తుంటే ఇక ఇదే ఎన్నికల అంశంగా ప్రచారం చేసేలా కనిపిస్తున్నారు అని మరో అధికారి వ్యాఖ్యానించారు. కెసిఆర్ చెప్పేదే నిజం అయితే రాష్ట్రం ఇంతగా అప్పుల పాలు ఎందుకు అవుతుంది...చివరకు పధకాల అమలుకు హైదరాబాద్ లోని ఖరీదు అయిన భూములను ఎడాపెడా ఎందుకు అమ్ముతున్నారు అని అయన ప్రశ్నించారు. ఈ ఎన్నికల సమయంలో కెసిఆర్, కెటిఆర్ నోట ఇంకా ఎన్ని అబద్దాలు వినాల్సి ఉంటుందో అని వ్యాఖ్యానిస్తున్నారు. కాళేశ్వరం వై వస్తున్న అవినీతి ఆరోపణల విషయాన్ని మరుగుపర్చటానికే కాళేశ్వరం బాకీ తీరిపోయింది అనే కొత్త డ్రామా తెరపైకి తెచ్చారు అని చెపుతున్నారు.

Next Story
Share it