ఉధ్యోగులను ప్రసన్నం చేసుకునే పనిలో సీఎం కెసీఆర్
తెలంగాణ ఉద్యోగులపై కెసీఆర్ వరాలు
ఉద్యోగుల పదవి విరమణ వయస్సు పెంపునకు కమిటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ రాష్ట్రంలో ఉద్యోగులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. గత కొంత కాలంగా ఉద్యోగులకు..ప్రభుత్వానికి మధ్య దూరం పెరిగింది. అది ఎంతలా అంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చివరకు టీచర్లకు ఎన్నికల బాధ్యతలు అప్పగించటానికి కూడా ప్రభుత్వం వెనకాడేంతగా. ఇలా జరగటం చరిత్రలో ఇదే మొదటిసారి. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు కూడా కెసీఆర్ ను ఉద్యోగుల విషయంలో మనసు మార్చుకునేలా చేసినట్లు కన్పిస్తోంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు తోడు పలు మున్సిపల్ కార్పొరేషన్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగాలపై వరాలు కురిపించారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల పదవి విరమణ వయస్సు పెంపు నిర్ణయాన్ని మళ్లీ బయటకు తీశారు. గతంలోనూ దీనిపై అప్పుడప్పుడు ప్రకటనలు వచ్చాయి. మళ్లీ వెనక్కి పోయింది. మళ్ళీ కొత్తగా దీని కోసం కమిటీ వేస్తున్నట్లు ప్రకటించారు.
నూతన సంవత్సర కానుకగా రాష్ట్రంలోని అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ విరమణ వయస్సును పెంచాలని, అన్నిశాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారని సీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు, వర్క్ చార్జుడ్ ఉద్యోగులు, డెయిలీ వైజ్ ఉద్యోగులు, ఫుల్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, పార్ట్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్ వాడీ వర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఆశ వర్కర్లు, విద్యా వలంటీర్లు, సెర్ఫ్ ఉద్యోగులు, గౌరవ వేతనాలు అందుకుంటున్న వారు, పెన్షనర్లు ఇలా అందరికీ ప్రయోజనం కలిగేలా వేతనాల పెంపు చేస్తామని సీఎం ప్రకటించారు.
అన్నిరకాల ఉద్యోగుల కలిపి తెలంగాణలో 9,36,976 మంది ఉంటారని, అందరికీ వేతనాల పెంపు వర్తిస్తుందని సీఎం చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు తక్కువ వేతనాలు ఉన్న ఆర్టీసీలో కూడా వేతనాలను పెంచాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. అవసరమైతే వేతనాల పెంపువల్ల ఆర్టీసీపై పడే భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఉద్యోగులకు సంబంధించిన అంశాలన్నింటినీ పరిష్కరించాలి. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో మొత్తం ప్రక్రియ పూర్తి కావాలి. మార్చి నుండి ఉద్యోగులంతా అన్నిరకాల సమస్యల నుండి శాశ్వతంగా విముక్తి కావాలి'' అని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.