ఏపీలో అంతే...ఏపీలో అంతే..!
రెండేళ్ళు స్కిల్ డెవలప్ మెంట్ ఛైర్మన్...ఇప్పుడు స్కిల్ డెవలప్ మెంట్ సలహాదారు
ఏపీ సర్కారు నిర్ణయాలు చూసి కొన్నిసార్లు అధికారులు కూడా అవాక్కు అవుతుంటారు. కానీ చేసేదేమీలేక అలా చూస్తూ ఉండిపోతారు. అలాంటిదే ఈ నిర్ణయం కూడా. చల్లా మధుసూదన్ రెడ్డిని ఏపీ సర్కారు 2019 జులై 19న ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ గా నియమించింది. ఈ రెండేళ్ళలో ఆయన ఆధ్వర్యంలో జరిగిన నైపుణ్యాభివృద్ధి సంగతి ఏంటో తెలియదు కానీ..సర్కారు ఆయన్ను ఇప్పుడు ఛైర్మన్ పోస్టు నుంచి సలహాదారు పదవికి అప్ గ్రేడ్ చేసింది. అది కూడా ఆయన ఛైర్మన్ పదవి కాలం అలా అయి పోతుంది అనగానే...అంటే జులై 17న ఇదే చల్లా మధుసూదన్ రెడ్డిని నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖకు సలహాదారుగా నియమించారు.
పరిశ్రమలు, ఐటి శాఖల మంత్రి గౌతంరెడ్డి లేఖతో సీఎంవో కార్యాలయం ఈ నెల 14న సలహాదారు పదవి సిఫారసు చేసింది. ఈ నెల 17న ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి నుంచి నోట్ వచ్చింది..అంతే అదే రోజున ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రభుత్వంలో తమకు కావాల్సిన వారికి మాత్రం ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా ఏ పోస్టు కావాలంటే ఆ పోస్టుకు సంబంధించి ఉత్తర్వులు వెలువడుతున్నాయని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. అంతే కాదు..ఇప్పటి వరకూ అదే విభాగానికి ఛైర్మన్ గా ఉన్న వ్యక్తిని..అదేదో ప్రభుత్వంలో సలహాదారులు తక్కువయ్యారన్నట్లు కొత్తగా మరో సలహాదారును తెరపైకి తెచ్చారన్నారు.