ఎన్టీవీ చౌదరి వియ్యంకుడిపై సీబీఐ కేసు
4376 కోట్ల రూపాయాల మేర బ్యాంకులకు మోసం
కోస్టల్ ప్రాజెక్ట్స్ అక్రమాలు..మోసాలను గుర్తించిన సీబీఐ
బ్యాంకు మోసాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలపై కేసుల మీద కేసులు నమోదు అవుతున్నాయి. ఓ వైపు రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ స్ట్రాయ్ పై ఇప్పటికే కేసు నమోదు అయింది. తాజాగానే ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వెలుగు వెలిగిన ఐవీఆర్ సీఎల్ ప్రాజెక్టు బ్యాంకు మోసాలపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. ఇప్పుడు మరో కంపెనీ వంతు వచ్చింది. అదే హైదరాబాద్ కు చెందిన కోస్టల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్. ఈ కంపెనీపై సీబీఐ తాజాగా కేసు నమోదు చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బిఐ) నేతృత్వంలో బ్యాంకుల కన్సార్టియానికి కంపెనీ 4736 కోట్ల మేర మోసం చేసినట్లు గుర్తించి ఈ కేసు నమోదు చేశారు. ఎస్ బిఐ ఫిర్యాదు మేరకు సీబీఐ రంగంలోకి దిగి కేసు నమోదు చేసింది. కోస్టల్ ప్రాజెక్టు సీఎండీ సబ్బినేని సురేంద్ర ఎలక్ట్రానిక్ మీడియా రంగంలోని ప్రముఖ ఛానల్ గా ఉన్న ఎన్టీవీ చౌదరి వియ్యంకుడు. సురేంద్ర కొడుకే ఎన్టీవీ చౌదరి అల్లుడు. 2013-2018 సంవత్సరాల కాలంలో కోస్టల్ ప్రాజెక్ట్స్ భారీ ఎత్తున మోసాలు..అక్రమాలకు పాల్పడినట్లు సీబీఐ ప్రతినిధి ఆర్ సీ జోషి వెల్లడించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
ప్రమోటర్ల పెట్టుబడులకు సంబంధించి తప్పుడు సమాచారం ఇవ్వటంతోపాటు బ్యాంకు నిధులను దారిమళ్ళించినట్లు సీబీఐ తేల్చింది. 2013 అక్టోబర్ నుంచి బ్యాంకు రుణ ఖాతా ఎన్ పీఏగా మారింది. ఆ తర్వాత జరిగిన పరిశీలన అనంతరం అంటే గత ఏడాది ఫిబ్రవరి20న ఇది మోసంగా గుర్తించారు. నిందితులకు చెందిన హైదరాబాద్, విజయవాడ నివాసాల్లో సోదాలు నిర్వహించి ఈ మోసానికి సంబంధించిన పత్రాలు..పలు ఆధారాలు సేకరించినట్లు తెలిపారు. సీబీఐ తన కేసులో సీఎండీ సబ్బినేని సురేంద్రతోపాటు గారపాటి హరిహరరావు, డైరక్టర్లు శ్రీధరన్ చంద్రశేఖరన్ నవరతి, శరద్ కుమార్ తదితరుల పేర్లను కూడా కేసులో చేర్చారు.విచిత్రం ఏమిటంటే తెలుగు మీడియాలో ఎక్కడా దీనిక ిసంబంధించిన వార్తలు కన్పించలేదు.