దసరా దాటితే ఆర్ఆర్ఆర్ కు పోటీ తప్పదా?!
దర్శక దిగ్గజం రాజమౌళికి టాలీవుడ్ లోని ప్రముఖ హీరోలు, దర్శకులు ఈ సారి పోటీ సంకేతాలు పంపారా?. అంటే ఔననే అంటున్నాయి ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న టాప్ హీరోల మల్టీ స్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ కూడా రెండు పాటలు మినహా అంతా పూర్తయిందని చిత్ర యూనిట్ కూడా అప్ డేట్ ఇచ్చింది. అయితే భారీ ఎత్తున కలెక్షన్స్ ఉండే దసరా సీజన్ లో కనక ఏదైనా కారణం వల్ల ఆర్ఆర్ఆర్ విడుదల వాయిదా వేస్తే మాత్రం తాము కూడా ఇక సర్దుబాటుకు గుడ్ బై చెప్పి బరిలో దిగాల్సి ఉంటుందని రాజమౌళికి టాలీవుడ్ ప్రముఖులు సంకేతాలు పంపారు. ఇది ఖచ్చితంగా ఆయా చిత్రాల కలెక్షన్లపై ప్రభావం చూపించటం ఖాయం. అత్యంత కీలకమైన స్లాట్ ను ఆర్ఆర్ఆర్ కోసం పెద్ద హీరోలు..నిర్మాతలు వదులుకున్నారు. అలా కాకుండా మళ్ళీ ఆర్ఆర్ఆర్ విడుదల తేదీ మారిస్తే మాత్రం తాము కూడా ఈసారి బరిలో ఉంటామని..అప్పుడు థియేటర్ల సమస్యతోపాటు చాలా సమస్యలు వస్తాయని తేల్చిచెప్పారు. టాలీవుడ్ లో గత కొంత కాలంగా పెద్ద హీరోలు..నిర్మాతల మధ్య సర్దుబాట్ల వ్యవహరం సాగుతూ ఉంది. ఇది చాలా వరకూ అంతర్గతంగానే ఉంటుంది.
ఒకేసారి పెద్ద హీరోల సినిమాలు విడుదల చేస్తే కలెక్షన్ల పరంగా ఇద్దరూ నష్టపోవాల్సి వస్తుందనే భావనతో సాధ్యమైనంత వరకూ పోటీలేకుండా లేకుండా చూసుకుంటూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో అయితే ఢీ అంటే ఢీ అంటుంటారు. అయినా అక్కడ కూడా కనీసం ఒక్క రోజు అయినా గ్యాప్ తీసుకుంటారు. ఇది ప్యూర్ లీ ఓపెనింగ్ కలెక్షన్స్ కోసమే. అయితే ఈసారి కరోనా కారణంగా టాలీవుడ్ సినిమాలు అన్నీ చిక్కుల్లో పడ్డాయి. ప్రస్తుతం థియేటర్ల ఓపెన్ కు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినా రకరకాల కారణాలతో ఇంత వరకూ సినిమాలు విడుదల కావటం లేదు. వచ్చే ఏడాది జనవరిలో మహేష్‌బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట విడుదలకు రెడీ అవుతోంది. పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హరహర వీర మల్లు సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోనే ఉంది. దీంతోపాటు మరికొన్ని సినిమాలు కూడా బరిలో ఉన్నాయి. అందుకే టాప్ హీరోలు..నిర్మాతలు రాజమౌళికి తమ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేశారని సమాచారం. అయితే ప్రచారం జరుగుతున్నట్లు కరోనా మూడవ దశ ఉంటుందా? పరిస్థితి అంతా సద్దుమణుగుతుందా అన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచిచూడాల్సిందే.