Top
Telugu Gateway

చంద్రబాబుకు బాలకృష్ణ ఝలక్?!

చంద్రబాబుకు బాలకృష్ణ ఝలక్?!
X

'వర్కింగ్ ప్రెసిడెంట్' పదవి కోసం పట్టు

పాతిక మందిలో ఒకడిగా నేనెందుకు?

ప్రత్యేక పాట కూడా సిద్ధం చేయించుకున్న బాలకృష్ణ

కుటుంబంలో కూడా 'పదవి చిచ్చు'?

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, తన అల్లుడు నారా లోకేష్ ల తీరుపై నందమూరి హీరో బాలకృష్ణ అసంతృప్తితో ఉన్నారా?. అంటే ఔననే సమాధానం వస్తోంది పార్టీ వర్గాల నుంచి. బాలకృష్ణ తనకు పార్టీలో 'కీలక' పదవి కావాలని పట్టుబడుతున్నారు. ఆయనకు ఇఫ్పటికే పొలిట్ బ్యూరో లో సభ్యత్వం ఇచ్చారు. అయితే అది బాలకృష్ణకు ఏ మాత్రం సంతృప్తినివ్వలేదు. 25 మందిలో ఒకటిగా ఉండటం తనకు ఇష్టం లేదని..తనకు ఓ ప్రత్యేక పదవి..హోదా కావాలని కోరుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా బాలకృష్ణ 'టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్' పదవి కోరినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఈ పదవి ఇవ్వటానికి చంద్రబాబు అంత సుముఖత వ్యక్తం చేయకుండా పొలిట్ బ్యూరోతో సరిపెట్టారు.. కొంత మంది నేతలు, మాజీ మంత్రులు బాలకృష్ణకు పొలిట్ బ్యూరో పదవి ఇవ్వటంతో హుషారుగా ఆయనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపేందుకు ప్రయత్నాలు చేయగా...ఆయన దగ్గర నుంచి వచ్చిన సమాధానం విని వారు షాక్ కు గురయ్యారు. ఆ తర్వాత మెల్లగా ఓకే అంటూ ఫోన్ పెట్టేశారు.

ప్రాంతీయ పార్టీల్లో ఏ పోస్టు ఉన్నా పేరుకే తప్ప...నిర్ణయాలు అన్నీ అధినేతలే తీసుకుంటారనే విషయం బహిరంగ రహస్యమే. అయితే చాలా మంది నేతలు హోదా కోసం, ఈ పదవుల కోసం కూడా ప్రయత్నాలు చేస్తారు. బాలకృష్ణ అందరిలాంటి వాడు కాదు కదా?. అంతే కాదు.. అసలు పార్టీయే తన తండ్రి ది అయితే మధ్యలో చంద్రబాబు లాగేసుకున్నారనే విమర్శలు ఎలా ఉండనే ఉన్నాయి. కాకపోతే అప్పట్లో అందుకు బాలకృష్ణ కూడా తన వంతు సహకారం అందించారు దీనికి. కానీ ఇప్పుడు చంద్రబాబు తన పార్టీలో తాను కోరుకున్న పదవి ఇవ్వకపోవటంతో రాజకీయం అంటే ఎలా ఉంటుందో ఆయనకు ఇఫ్పుడు తెలిసొస్తుందనే వ్యాఖ్యలు కూడా విన్పిస్తున్నాయి.

తాను కోరుకున్న పదవి ఇవ్వలేదనే కారణంతోనే బాలకృష్ణ సోమవారం నాడు జరిగిన తొలి పొలిట్ బ్యూరో సమావేశానికి డమ్మా కొట్టినట్లు చెబుతున్నారు. బాలకృష్ణ పదవి వ్యవహారం కుటుంబంలో కూడా వివాదాలకు కారణమైందని ప్రచారం జరుగుతోంది. దేశంతోపాటు రాష్ట్రంలో కూడా కోవిడ్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో నారా లోకేష్ కూడా యాక్టివ్ అయ్యారు. ఓ వైపు రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడి నియామకం..మరో వైపు బాలకృష్ణ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి డిమాండ్ వంటి పరిణామాలతో అటు చంద్రబాబు, ఇటు లోకేష్ లు ఒకింత కలవరానికి గురవుతున్నారని చెబుతున్నారు. పార్టీలో ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో వేచిచూడాల్సిందే. బాలకృష్ణ కూడా కొద్ది రోజుల క్రితమే తనకు సన్నిహితులైన కొంత మంది నేతలతో పార్టీ పదవి అంశంపై చర్చించినట్లు చెబుతున్నారు. అయ్యన్నపాత్రుడు, అశోక్ గజపతిరాజు తదితరులు కూడా సమావేశానికి హాజరు కాకపోయినా బాలకృష్ణ గైర్హాజరీనే కీలకంగా మారింది.

Next Story
Share it