ఏపీ ఇమేజ్ కు డ్యామేజ్ జరిగిందా..8 కోట్లతో అది సెట్ అవుతుందా?
మొన్న ఎన్డీటీవీకి కాంట్రాక్ట్..ఇప్పుడు టైమ్స్ గ్రూపు కు 8.15 కోట్లు
ప్రజల డబ్బుతో నేతలు ఇమేజ్ లు పెంచుకుంటారా?
చంద్రబాబు బాటలోనే సీఎం జగన్
ఏపీలో జగన్ సర్కారు సంక్షేమంలో దేశంలో తామే నెంబర్ వన్ అని చెప్పుకుంటుంది. అసలు ఒక్క ఏడాదిలో ఇన్ని40 వేల కోట్ల రూపాయలు పైన ప్రజలకు ఇచ్చిన ప్రభుత్వం ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నిస్తారు. అంతే కాదు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కూడా ఏపీనే నెంబర్ వన్ అని..అది జగన్ కృషి వల్లే వచ్చిందని చెబుతారు. రాజకీయంగా చూస్తే అసెంబ్లీలో 175కు 151 సొంత సీట్లు. లోక్ సభలో 25కు గాను 22 ఎంపీ సీట్లు. ఏ ప్రభుత్వానికి అయినా, పార్టీకి అయినా సొంత రాష్ట్రంలో ఇమేజ్ అవసరం. మళ్లీ గెలవాలంటే అది కీలకం. చేసిన పనులు అక్కడి ప్రజలకు తెలుసుకనుక అప్పుడప్పుడు ఆ విషయాలను గుర్తు చస్తే సరిపోతుంది. కానీ ఏపీసర్కారు తాజాగా ఓ విచిత్ర జీవో జారీ చేసింది. ఢిల్లీలో రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్, నాయకుల ఇమేజ్ ను జాతీయ స్థాయిలో పెంచుతారట. అసలు ఇప్పుడు ఏపీ ఇమేజ్ కు వచ్చిన ఇబ్బంది ఏంటి?. అసలు రాజకీయంగా ఇంత అప్రతిహిత మెజారిటీతో గెలిచిన జగన్ కు కొత్తగా ఇమేజ్ పెంచుకోవాల్సిన అవసరం ఏముంది?.
ఓ వైపు తీవ్ర ఆర్ధిక సం క్షోభం రాష్ట్రాన్ని వెంటాడుతున్న తరుణంలో 8.15 కోట్ల రూపాయలు టైమ్స్ గ్రూప్ నను కు ఇవ్వాల్సిన అవసరం ఏముందని అన్న చర్చ మొదలైంది. అసలు ఏపీ ఇమేజ్ ఓ మీడియా సంస్థ పెంచితే పెరుగుతుందా?. రాష్ట్రంలో ప్రభుత్వం చేసే పనుల వల్ల పెరుగుతుందా?. గతంలో చంద్రబాబు కూడా జాతీయ మీడియా ప్రసన్నం చేసుకునేందుకు భారీ ఎత్తున ప్రకటనలు ఇవ్వటంతో పాటు రకరకాల మార్గాలను అనుసరించేవారు. కానీ ఇఫ్పుడు నేరుగా రాష్ట్రం ఇమేజ్, నాయకుల ఇమేజ్ పెంచటం కోసం అంటూ జీవోలో పేర్కొనటం ఏమాత్రం సరికాదని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఇఫ్పటికే ఏపీ సర్కారు శృతిమించిన రీతిలో ప్రకటనలు జారీ చేస్తోందనే విమర్శలు ఉన్నాయి. వాస్తవానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక్క అమరావతి ఈవెంట్ కోసమే ఇదే టైమ్స్ 50 కోట్ల రూపాయాలకు పైన అంచనా వ్యయంతో ఓ ఈవెంట్ ప్లాన్ చేసింది.
దీనిపై అప్పట్లో మీడియాలో వార్తలు రావటం, విమర్శలు ఎక్కువ కావటంతో చంద్రబాబు వెనక్కి తగ్గారు. అప్పట్లో ప్రధాని మోడీ కూడా ఇది రద్దు చేస్తే తప్ప కార్యక్రమానికి రానని చెప్పినట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరిగింది. ఇదే జగన్ సర్కారు కొద్ది రోజుల క్రితమే మరో జాతీయ ఛానల్ ఎన్ డీటీవీ కూడా ఏపీలో ఓ ప్రాజెక్టును అప్పగించింది. అది కూడా ఏంటి అంటే అప్పటికే నిర్ణయం అయిపోయిన ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టే అంశంపై ప్రజాభిప్రాయ సేకరణతోపాటు ప్రభుత్వ కార్యక్రమాలపై ఏడు షార్ట్ ఫిల్మ్ లు తీసే కాంట్రాక్ట్ అప్పగిస్తూ జీవో 25 జారీ చేశారు. సర్వశి క్ష అభియాన్ నిధుల నుంచి కేటాయింపులు చేయాలని సూచించారు. తాము ఏది చేసినా పారదర్శకంగా చేస్తామని చెప్పే ప్రభుత్వం ఎన్ డీటీవీకి ఎంత మొత్తం చెల్లింపులు చేయనున్నారనే అంశం మాత్రం జీవోలో పెట్టకుండా రహస్యంగా ఉంచారు. ఇప్పుడు టైమ్స్ గ్రూపునకు చెల్లించే మొత్తాన్ని మాత్రం జీవోలో పేర్కొన్నారు.