అంబటి లెక్క ప్రకారం నిమ్మగడ్డ దగ్గరకు సీఎస్ వెళ్ళొచ్చా?!
'ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు కోసం పనిచేస్తున్నారు. నిమ్మగడ్డలో చంద్రబాబు పరకాయ ప్రవేశం చేశారు. అసలు నిమ్మగడ్డ నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తారంటే ఎవరైనా నమ్ముతారా?. ఇది ఎన్నికల కమిషన్ కాదు.. చంద్రబాబు-నిమ్మగడ్డ కమిషన్‌గా మారింది.' అంటూ వైసీపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ నేత అంబటి రాంబాబు ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓకే రాజకీయంగా అది వైసీపీ వైఖరి. ఎస్ఈసీ నిర్వహించిన రాజకీయ పార్టీల సమావేశానికి కూడా తాము హాజరుకాబోమని వైసీపీ ముందే ప్రకటించింది. ఎస్‌ఈసీని ఓ రాజకీయ పార్టీకి తాకట్టు పెట్టేలా నిమ్మగడ్డ రమేష్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు అంబటి. మరి వైసీపీ పార్టీ వైఖరి ఒకటి. వైపీపీ ప్రభుత్వ వైఖరి మరొకటా?. ప్రభుత్వంలో ఉన్నది వైసీపీనే కదా?. రాష్ట్ర పరిపాలనకు సంబంధించినంత వరకూ ప్రధాన కార్యదర్శి అత్యంత కీలకం అన్న విషయం తెలిసిందే.
ఓ వైపు అంబటి రాంబాబు అసలు తాము నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను నమ్మం..ఆయన చంద్రబాబు మనిషి..సుప్రీంకోర్టు చెప్పినా కూడా అంతే చేస్తున్నారు అని ఆరోపణలు గుప్పిస్తుంటే..మరో వైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన ముఖ్య అధికారులు అందరూ ఎస్ఈసీ రమేష్ కుమార్ ను కలసి ప్రభుత్వం తరపున వాదన విన్పించటం అంటే ఈ వ్యవహారం అంతా పరస్పర విరుద్ధంగా ఉందనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. వైసీపీ సర్కారు, ముఖ్యంగా సీఎం జగన్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఇంత గుర్రుగా ఉన్న సమయంలో సీఎం అనుమతి లేకుండా సీఎస్ రమేష్ కుమార్ వద్దకు వెళతారా? అంటే నో ఛాన్స్ అని చెబుతున్నారు అధికారులు. అధికారంలో ఉన్న పార్టీనే ఆ వ్యక్తిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తుంది. అదే వ్యక్తికి ప్రభుత్వంలోని కీలక స్థానాల్లోని వ్యక్తులు వెళ్ళి కలసి నివేదికలు అందజేసి వస్తారు. ఈ వ్యవహారం అంతా విచిత్రంగా ఉందని అధికారులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఏతావాతా రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికలు ఇప్పుడు పెట్టాలా వద్దా అనే అంశంపై పిల్ పై విచారణ సందర్భంగా హైకోర్టు నిర్ణయం తీసుకుంటుందనే అభిప్రాయాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎస్ఈసీతో భేటీ అయిన సీఎస్ నీలం సాహ్ని కరోనా కారణంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని వివరించినట్లు సమాచారం.