వైసీపీ సభ్యత్వం లేకపోయినా రాజ్యసభ సీట్లు
వైసీపీకి దక్కే నాలుగు రాజ్యసభ స్థానాలకు మంగళవారం సీఎం జగన్ అభ్యర్ధులను ఖరారు చేశారు. ఇందులో అడ్వకేట్ నిరంజన్ రెడ్డి, బీసీ నేత క్రిష్ణయ్యలకు వైసీపీ సభ్యత్వం కానీ...ఆ పార్టీతో నేరుగా ఎలాంటి సంబంధాలు లేవు. నిరంజన్ రెడ్డి జగన్ వ్యక్తిగత లాయర్...ఏపీ ప్రభుత్వ కేసులు వాదించినందుకు ఆయనకు భారీ ఎత్తున పీజులు ముట్టచెబుతూ జీవోలు ఇచ్చారని గతంలో పలు విమర్శలు వచ్చాయి. అంటే జగన్ తన వ్యక్తిగత లాయర్ కు రాజ్యసభ సీటు ఖరారు చేశారు అనుకుందాం. ఆర్. క్రిష్ణయ్యది వైసీపీ వర్గాలతోపాటు అందరికీ పెద్ద సస్పెన్సే అని చెప్పొచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో ఓ పదిహేను సంవత్సరాల క్రితం అంటే ఆర్. క్రిష్ణయ్యకు బీసీ నేతగా ఓ ఇమేజ్ ఉండేది. ఆ తర్వాత ఆయన ఓసారి టీడీపీలో పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత కాంగ్రెస్ లో పోటీచేసి ఓడిపోయారు. ఇప్పుడు అనూహ్యంగా ఏపీలో వైసీపీ తరపున రాజ్యసభ సభ్యత్వం దక్కింది. అయితే నిరంజన్ రెడ్డి విషయంలో జగన్ లెక్కలు ఆయనకు ఉండొచ్చు. కానీ క్రిష్ణయ్యకు రాజ్యసభ సీటు ఇవ్వటం వల్ల రాజకీయంగా వైసీపీకి, జగన్ కు ఎంత మేలు చేస్తుంది అన్నది వేచిచూడాల్సిందే. గతంలో టీడీపీ కూడా రాష్ట్రేతరులకు రాజ్యసభ స్థానాలు ఇచ్చినా ఎన్డీయేలో భాగస్వామిగా ఉండటంతో బిజెపి సిఫారసు చేసిన వాళ్లకు సీట్లు కేటాయించారు. తాజా జాబితాలో రాజ్యసభ సీటు దక్కించుకున్న బీద మస్తాన్ రావు కూడా 2019 డిసెంబర్ లోనే టీడీపీ నుంచి వచ్చి వైసీపీలో చేరారు.