Telugu Gateway
Telugugateway Exclusives

కొత్త సంవత్సరంపైనే కోటి ఆశలు

కొత్త సంవత్సరంపైనే కోటి ఆశలు
X

ఈ మధ్య కాలంలో ఎవరూ 2020 అంతటి దారుణ సంవత్సరాన్ని చూడలేదనే చెప్పాలి. కారణం అందరికీ తెలిసిందే. కరోనా దెబ్బకు ఆర్ధిక వ్యవస్థలు కకావిలకం కాగా..సామాన్యుల నుంచి సంపన్నుల వరకూ అందరూ ఏదో ఒక రకంగా ఇబ్బందిపడ్డవారే. కేంద్రం వరస పెట్టి అన్ లాక్ లు చేసుకుంటూపోయినా దాదాడు ఏడు నెలల పాటు దేశ ప్రజలు అందరూ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ముఖ్యంగా వలస కూలీలు..చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు...చిన్న ఉద్యోగులు కోట్లాది మంది రోడ్డునపడ్డారు. దేశ వ్యాప్తంగా ఇప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే పరిమిత సంఖ్యలో అయినా కూడా కొంత మందికి కరోనా రెండోసారి కూడా రావటం ప్రజలను మరింత భయబ్రాంతులకు గురిచేస్తోంది. అంతే కాదు...కరెన్సీ నోట్ల ద్వారా కూడా కోవిడ్ 19 వ్యాప్తికి ఛాన్స్ ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ)తేల్చటం కూడా ప్రజలను మరింత భయబ్రాంతులకు గురిచేస్తోంది. డిజిటల్ మనీ గురించి ఎంత మాట్లాడుతున్నా దేశంలో ఎక్కువ లావాదేవీలు నగదు రూపంలో జరుగుతాయనే విషయం తెలిసిందే. కరెన్సీ ద్వారా బ్యాక్టీరియా, వైరస్ ల వ్యాప్తికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందని ఆర్ బిఐ కొద్ది రోజుల క్రితం స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు అందరి నోటా ఒకటే మాట విన్పిస్తోంది.

అది ఏంటి అంటే డిసెంబర్ నాటికి లేదా కొత్త సంవత్సరం ప్రారంభంలో కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని అంచనాలు వస్తున్నాయి. భారత్ నుంచి కూడా ఏకంగా ఒకట్రెండు వ్యాక్సిన్లు డిసెంబర్ లేదా జనవరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం కన్పిస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంగళవారం నాడు ఈ విషయం వెల్లడించారు. అంతే కాదు కోవిడ్ 19 వ్యాక్సిన్ పంపిణీకి అవసరమైన వ్యూహాలను నిపుణుల బృందాలు రూపొందిస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్‌ లేదా వచ్చే ఏడాది ఆరంభంలో కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ ప్రపంచం ముందుకు వస్తుందని ఆశిస్తున్నట్టు డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మంత్రుల బృందం భేటీలో మంత్రి భారత్‌లో వ్యాక్సిన్‌ అందుబాటు, పంపిణీ అంశాలపై ఈ వ్యాఖ్యలు చేశారు. డబ్ల్యూహెచ్ వో కూడా డిసెంబర్ నాటికి వ్యాక్సిన్ వస్తుందని ధీమాగా చెబుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం 40 వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉండగా, పది మాత్రం తుది దశలో ఉన్నాయి.

Next Story
Share it