Telugu Gateway
Telangana

ఈ మార్పు దేనికి సంకేతం?

ఈ మార్పు దేనికి సంకేతం?
X

తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ మంది ముఖ్యమంత్రి ఛాన్స్ రేవంత్ రెడ్డి కే వస్తుంది అని నమ్మారు. గెలుపుపై ఏ మాత్రం నమ్మకం లేని రోజుల్లో కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి కూడా ఆ దిశగా పార్టీని విజయతీరాలకు తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. తొలుత గులిగినా తర్వాత సీనియర్లు కూడా రేవంత్ రెడ్డి కి సహకరించారు అనటంలో సందేహం లేదు. అయితే తెర వెనక మాత్రం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేశారు. సీఎం పదవి రేస్ లో తాము కూడా ఉన్నట్లు మల్లు భట్టి విక్రమార్క తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వాళ్ల ప్రయత్నాలు వాళ్ళు చేసుకున్నారు. కానీ అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అటు పార్టీ యాడ్స్ లో అయినా...ప్రభుత్వానికి సంభందించిన ప్రజాపాలన యాడ్స్ లో ఒక వైపు సీఎం రేవంత్ రెడ్డి, మరో వైపు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫోటోలు ప్రముఖంగా పెడుతూ వచ్చారు. ఇటీవల వరకు ఇదే విధానం కొనసాగింది. అయితే శుక్రవారం నాడు తెలంగాణ ప్రభుత్వం తెలుగు పత్రికలతో పాటు ఇంగ్లీష్ పత్రికల్లో కూడా ఫస్ట్ పేజీ యాడ్స్ ఇచ్చింది.

కేస్లాపూర్ నాగోబా జాతరకు సంబందించిన యాడ్ అది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో చాలా పెద్దగా వేశారు. ఇక్కడ తప్పు పెట్టాల్సింది ఏమి లేదు. అయితే గత కొంత కాలంగా సాగుతున్న ట్రెండ్ కు బిన్నంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫోటో సైజు తగ్గింది...ఫోటో పూర్తిగా కిందకు దిగింది. ఇదే ఇప్పుడు అధికార వర్గాలతో పాటు కాంగ్రెస్ నాయకుల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ మార్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో జరిగిందా..లేక ఐ అండ్ పీఆర్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారా?. ఆ శాఖ అధికారులే వాళ్ళంతట వాళ్ళు ఈ పని చేసారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రేవంత్ రెడ్డి తన స్టైల్ కు బిన్నంగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మల్లు భట్టి విక్రమార్క కు ప్రాధాన్యత ఇస్తూ..ఆయన్ను కలుపుకుని ముందుకు సాగుతున్నారు. కానీ సడన్ గా ప్రభుత్వ యాడ్స్ లో వచ్చిన ఈ మార్పుకు కారణం ఏంటో అన్నది హాట్ టాపిక్ గా మారింది.

Next Story
Share it