తెలంగాణ సర్కారు రివర్స్ గేర్..న్యూఇయర్ వేడుకలకు ప్రత్యేక అనుమతి
అందరూ ఆంక్షలు పెడుతుంటే..ఇక్కడ మాత్రం ప్రత్యేక అనుమతులు
దేశం అంతా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ రాష్ట్రాలుఆంక్షలు విధిస్తున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో అయితే ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. అక్కడ స్కూళ్లు, సినిమా హాళ్లు పూర్తిగా మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రెస్టారెంట్లను 50 శాతం సామర్ధ్యంతో అనుమతిస్తున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ సర్కారు మాత్రం దీనికి భిన్నంగా..తాజాగా తెలంగాణ హైకోర్టు చెప్పిన దానికి రివర్స్ గా నిర్ణయం తీసుకోవటం విశేషం. ఇప్పటికే హైదరాబాద్ పబ్ ల్లో ఎవరూ మాస్క్ పెట్టుకుని కన్పించరు. అలాంటిది నూతన సంవత్సర వేడుకలకు మాత్రం ప్రత్యేక అనుమతులు ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. తెలంగాణ హైకోర్టు కూడా నూతన సంవత్సరం, క్రిస్మస్ సందర్భంగా ప్రజలు గుమికూడకుండా ఇతర రాష్ట్రాల తరహాలో ఆంక్షలు విధించాలని సూచించింది. అయితే ప్రభుత్వం మాత్రం ర్యాలీలు..బహిరంగ సభలకు అనుమతులపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో తాజాగా ఏడు కొత్త ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 62 కు పెరిగాయి. ఇవేమీ పట్టించుకోని ప్రభుత్వం నూతన సంవత్సర వేడుకలకు ప్రత్యేక అనుమతులు ఇవ్వటంపై అధికారులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతతో వ్యవహరించాల్సిన సర్కారు..ఆదాయం కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టేలా ఈ నిర్ణయం ఉందని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారు.
మంగళవారం సాయంత్రం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కొత్త సంవత్సరం వేడుకలకు ప్రత్యేక అనుమతులు జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది చివరిరోజున మద్యం షాపులు, బార్లు, స్పెషల్ ఈవెంట్లకు అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 31న ఈ ప్రత్యేక అనుమతులు వర్తిస్తాయి. మద్యం దుకాణాలకు అర్దరాత్రి 12గంటల వరకు తెరిచి ఉంచొచ్చు. అలాగే బార్స్, ఈవెంట్స్, పబ్‌లకు రాత్రి ఒంటిగంటకు వరకు అనుమతి ఇచ్చింది. ఓవైపు ఒమిక్రాన్ కారనంగా అన్ని చోట్ల ఆంక్షలు విధిస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతుల పేరిట సడలింపులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇదే సర్కారు ఒమిక్రాన్ కట్టడిలో భాగంగా జనవరి 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. కానీ ఈ స్పూర్తికి భిన్నంగా ఇప్పుడు నూతన సంవత్సర వేడుకలకు అనుమతులు ఇచ్చింది. మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు చాలా ముందే నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించాయి.