మరోసారి 'టార్గెట్ ఈటెల'?!
స్పీకర్ ను అవమానించటం అంటే మొత్తం సభను అవమానించినట్లేనని..ఈటెల రాజేందర్ క్షమాపణ చెప్పకపోతే ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. బుధవారం నుంచి ఈటెల రాజేందర్ కు స్పీకర్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని మీడియాకు లీకులు ఇచ్చారు. ఇదే టీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉండగా గవర్నర్, స్పీకర్, సీఎం, మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఎన్నో. ఓ వైపు తెలంగాణ అసెంబ్లీలో మాత్రం సీఎం కెసీఆర్ అసలు సభలో పోడియం వైపు వెళితే చాలు ఆటోమేటిక్ గా సస్పెండ్ అయిపోయేలా నిబంధనలు ఉండాలని కోరతారు. కానీ టీఆర్ఎస్ ఎంపీలు మాత్రం లోక్ సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనలు చేయవచ్చు. తెలంగాణలో మాత్రం ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఇలాంటివి ఏమీ చేయకూడదు. ప్రతిపక్షంలో ఉండగా ఎవరూ చేయని రీతిలో చేసిన టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మాత్రం కొత్త కొత్త రూల్స్ పెడుతోంది. స్పీకర్ పై విమర్శలు చేశారనే కారణంతో ఈటెల రాజేందర్ పై చర్య తీసుకుంటే రాజకీయంగా అది టీఆర్ఎస్ కు మరోసారి నష్టం చేయటం ఖాయం అని..ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఇలా చేసిందనే ఛాన్స్ ఉంటుందని ఓ టీఆర్ఎస్ నాయకుడు అభిప్రాయపడ్డారు. బలహీనవర్గాలకు చెందిన ఈటెల రాజేందర్ ను ఈ సాకుతో ప్రభుత్వం మరోసారి చర్యలు చేపడితే రాజకీయంగా ఇది టీఆర్ఎస్ కు మరింత నష్టం చేస్తుందనే చర్చ సాగుతోంది.