Telugu Gateway
Telangana

వ్యూహం ప్రకారమే కెసిఆర్ అసెంబ్లీకి వచ్చారా!

వ్యూహం ప్రకారమే కెసిఆర్ అసెంబ్లీకి వచ్చారా!
X

ఈ క్రెడిట్ బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కు మాత్రమే దక్కుతుంది. ముఖ్యమంత్రి అన్న తర్వాత సచివాలయానికి వెళ్ళటం అత్యంత సాధారణ విషయం. ఎప్పుడో ఒకప్పుడు తప్ప గతంలో సీఎం లు సచివాలయానికి దూరంగా ఉండేవాళ్ళు కాదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత కెసిఆర్ దగ్గర దగ్గర పది సంవత్సరాలు సీఎం గా ఉన్నా ఆయన సచివాలయానికి హాజరు అయింది అతి తక్కువ కాలమే అన్న విషయం తెలిసిందే. అందుకే ముఖ్యమంత్రి సచివాలయానికి వెళితే కూడా అది ఒక పెద్ద వార్తగా మారిపోయింది. ఇప్పుడు మళ్ళీ అదే సీన్ రిపీట్ అయింది. మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలంగాణాలో ప్రతిపక్ష నేతగా ఉన్న కెసిఆర్ గురువారం నాడు తొలిసారి అసెంబ్లీ కి వచ్చారు. మాములుగా అయితే ఇది ఏ మాత్రం వార్త కాదు. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు సభకు హాజరు కావటం అన్నది అత్యంత సహజం అయిన విషయం కాబట్టి. కానీ అది కెసిఆర్ కాబట్టి...తొలి సారి అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు కాబట్టి ఇది కూడా ఇప్పుడు పెద్ద వార్తగా మారింది.

తెలంగాణ బడ్జెట్ పెడుతున్న సందర్భంగా తొలి సారి అసెంబ్లీ వచ్చిన కెసిఆర్ ఇది కూడా ఒక్క రోజు వ్యవహారంగానే మారుస్తారా..లేక సమావేశాలు జరిగే అన్ని రోజులు కూడా సభకు వస్తారా లేదా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు. బడ్జెట్ రోజు మాత్రమే కెసిఆర్ సభకు హాజరు కావటం వెనక వ్యూహం కనిపిస్తోంది అనే అభిప్రాయం కూడా ఉంది. ఎందుకంటే ఈ రోజు బడ్జెట్ ప్రసంగం తప్ప వేరే బిజినెస్ కు ఛాన్స్ ఉండదు. అందుకే కెసిఆర్ ఈ రోజును ఎంచుకున్నారు అనే అభిప్రాయం కూడా కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన రోజుల్లో అయితే అధికార కాంగ్రెస్ నుంచి కెసిఆర్ కు పలు ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉండేది. కానీ ఈ రోజు అలాంటి ఛాన్స్ ఉండదు. అందుకే బడ్జెట్ రోజును కెసిఆర్ ఎంచుకున్నట్లు చెపుతున్నారు. ఇక్కడ మరో విచిత్రం ఏమిటి అంటే బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత కెసిఆర్ అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడారు. బడ్జెట్ పై స్పందించారు.

అక్కడ కూడా విచిత్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కి ఆరు నెలలు సమయం ఇద్దామని తాను అసెంబ్లీ రాలేదు అని చెప్పుకొచ్చారు. కానీ బిఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు లు మాత్రం అసెంబ్లీ సాక్షిగా..బయట కూడా తుంటి ఆపరేషన్ కారణంగా రాలేదు అంటూ చెప్పిన విషయం తెలిసిందే. కెసిఆర్ చెప్పిందే కాసేపు నిజం అనుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అటు కేటీఆర్, ఇటు హరీష్ రావు లు ఇంకా తామే అధికారంలో ఉన్నట్లు అసెంబ్లీ లో వ్యవహరించిన తీరు అందరూ చూశారు. కెసిఆర్ చెప్పినట్లు నిజంగా కాంగ్రెస్ కు సమయం ఇవ్వాలని ఉంటే బిఆర్ఎస్ నాయకులు మొదటి సమావేశాల నుంచి ఎందుకు రచ్చ చేసినట్లు?. తన అసెంబ్లీ డుమ్మాకు ఇప్పుడు కెసిఆర్ కొత్త సిద్ధాంతాన్ని తెరమీదకు తెచ్చారు. మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఒత్తిపలకటం తప్ప కొత్తగా ఏమి లేదు అన్నారు కెసిఆర్. ఈ బడ్జెట్ పై చీల్చి చెండాడుతాం అంటూ కామెంట్ చేశారు.

Next Story
Share it