Telugu Gateway
Telangana

తెలంగాణ మంత్రుల్లో ఫోన్ల ట్యాపింగ్ భయం

తెలంగాణ మంత్రుల్లో ఫోన్ల ట్యాపింగ్ భయం
X

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలంగాణ మంత్రులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ల ట్యాపింగ్ భయంతో టీఆర్ఎస్ నేతలు ఎవరూ తనతో మాట్లాడటం లేదని అన్నారు. అదే సమయంలో తెలంగాణ మంత్రులు ఈటెల రాజేందర్ , హరీష్ రావులపై కీలక వ్యాఖ్యలు చేశారు. వీళ్ళిద్దరిలో ఎవరికి పార్టీ పగ్గాలు వచ్చినా తాను టీఆర్ఎస్ లో తిరిగి చేరతానని వ్యాఖ్యానించారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు. హరీష్ రావు, ఈటెల రాజేందర్ లు తనకు ఇష్టమైన నేతలు అన్నారు. తక్కువ మాట్లాడతారు... ఎక్కువ వింటారని వ్యాఖ్యానించారు. ఈటలను కలిసి మాట్లాడాలనుకుంటున్నానని, అపాయింట్‌మెంట్ కూడా అడిగానని చెప్పుకొచ్చారు. అయితే ఇంకా అవకాశం ఇవ్వలేదన్నారు. ఈటల గొప్ప వామపక్షవాది అని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌పై ఒక్కోసారి అలుగుతారు.. మరోసారి దోస్తీ చేస్తున్నారని చురకలు వేశారు. అది కనుక్కుందామనే... ఆయనతో భేటీకి ప్లాన్ చేసినట్టు చెప్పారు. నిజంగా బయటకు వచ్చేది ఉంటే వచ్చేయండని చెబుతానన్నారు.

ఈటల సొంత పార్టీ ఏర్పాటు చేస్తే గొప్ప నాయకుడు అవుతాడని జోస్యం చెప్పారు. ఆలస్యం చేస్తే.. సీఎం కేసీఆర్‌తో కలసి ఈటల కూడా డ్రామాలు ఆడుతున్నారనుకోవాల్సి వస్తోందన్నారు. ఏ పార్టీలో చేరాలనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. పోరాడే నేతకు పీసీసీ పదవి ఇస్తే మళ్ళీ కాంగ్రెస్ లో చేరతానని వ్యాఖ్యానించారు. నాగార్జునసాగర్ లో జానారెడ్డి గెలవబోతున్నారని తెలిపారు. తెలంగాణలో మరో బలమైన ప్రాంతీయ పార్టీ కోసం కోదండరామ్, తీన్మార్ మల్లన్నతోనూ మాట్లాడతానని ప్రకటించారు.

Next Story
Share it