Telugu Gateway
Telangana

టాలీవుడ్ కు రేవంత్ రెడ్డి షరతు

టాలీవుడ్ కు రేవంత్ రెడ్డి షరతు
X

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. టాలీవుడ్ విషయంలో ఇంతకాలం ఎవరూ చేయని పనిచేశారు. టాలీవుడ్ కు చెందిన కీలక సినిమాల నిర్మాణ సంస్థలు ప్రతిసారి తమ సినిమా టికెట్స్ ధర పెంచుకోవటానికి..అదనపు షో ల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటూ ఉంటాయి. పెద్ద హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ పేరు చెప్పి గత కొన్ని సంవత్సరాలుగా ఈ అనుమతులు తీసుకుంటున్నారు. ఇలాంటి వాళ్లకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పెట్టిన ముందస్తు షరతు ఆసక్తికరంగా మారింది. సమాజం నుంచి ఎంతో తీసుకుంటున్న వీళ్ళు సమాజం కోసం ఎంతో కొంత చేయాలని...ఇలా దరఖాస్తు చేసే ప్రతి సినిమాకు చెందిన హీరో, హీరోయిన్లు రాష్ట్రంలో డ్రగ్స్, సైబర్ క్రైమ్ కు వ్యతిరేకంగా రెండు నిమిషాల నిడివిగల ఫుటేజ్ ప్రభుత్వానికి ఇవ్వాలని..అప్పుడే వాళ్ళు కోరినవిధంగా అనుమతులు మంజూరు చేస్తామని ముందస్తు షరతు పెడుతున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇది రాష్ట్రం కోసం..రాష్ట్రంలోని యువతను డ్రగ్స్ బారిన పడకుండా చేయటంతో పాటు ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా ఉపయోగపడుతుంది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు.

ఎందుకంటే సినిమాలకు చెందిన సెలబ్రిటీలు చెప్పే వాటికీ ఎంతో రీచ్ ఉంటుంది అనే విషయం తెలిసిందే. టాలీవుడ్ విషయంలో నిజంగా సీఎం రేవంత్ రెడ్డి పెట్టిన షరతు అత్యంత ఆమోదయోగ్యమైనదిగానే చెప్పొచ్చు. ఇప్పుడు ఎలాంటి షరతులు లేకుండా పరిశ్రమ కోరిన ప్రతిసారి టికెట్ రేట్స్ పెంచుకోవటానికి అనుమతులు మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలు ప్రదర్శించే చోట వీళ్ళు నటించిన ఈ వీడియోలు కూడా ప్రసారం చేయాలన్నారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం రోజు చిరంజీవి ముందుకు వచ్చి ఒక వీడియో చేసి పంపారు అని..అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు రేవంత్ రెడ్డి. కొంతమంది అక్రమార్జనకు డ్రగ్స్ ను అమ్ముతున్నారు అని...సైబర్ నేరాలు కూడా అతిపెద్ద సమస్యగా మారాయన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల కారణంగా ఇప్పుడు స్కూల్స్, కాలేజీల్లో కూడా డ్రగ్స్, గంజాయి విచ్చలవిడిగా దొరుకుతున్నాయన్నారు. వీటి కట్టడికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది అని తెలిపారు. టాలీవుడ్ తమ వ్యాపారంతో పాటు సామజిక బాధ్యతను కూడా నెరవేర్చాలన్నారు.

Next Story
Share it