భయం భయంగా బిఆర్ఎస్
తెలంగాలో అధికార బిఆర్ఎస్ కు ఈ సారి గెలుపు అంత ఈజీ కాదు. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఇప్పటికే ఆ పార్టీ రెండు సార్లు అధికారంలో ఉండటం, వివిధ వర్గాల్లో బిఆర్ఎస్ కీలక నేతలు అయిన సీఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్ వ్యవహార శైలిపై కూడా తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. ఏ వర్గాలను కూడా లెక్క చేయకుండా తమకు నచ్చిందే విధానం..తాము చెప్పేదే వేదం అన్నట్లు వ్యవహరిస్తూ వచ్చారు. కొంత మంది మంత్రులది అదే దారి. ఇప్పుడు ప్రజలకు ఛాన్స్ వచ్చింది. ఈ ఎన్నికల్లో వాళ్ళు తమ నిర్ణయాన్ని వెలిబుచ్చటానికి రెడీ అవుతున్నారు. వరసగా మూడవ సారి కూడా విజయం దక్కించుకుని సీఎం కెసిఆర్ దక్షిణాదిలో తొలి హ్యాట్రిక్ సీఎం గా నిలుస్తారు అని మంత్రి కెటిఆర్ తన ప్రతి మీటింగ్ లో చెపుతున్నారు. అయితే అది జరిగే పని కాదు అని ఒక జాతీయ ఛానెల్ నిర్వహించిన ప్రీ పోల్ సర్వే లో వెల్లడైంది. 119 అసెంబ్లీ సీట్లు ఉన్న తెలంగాణాలో ఈ సారి కాంగ్రెస్ పార్టీ 54 సీట్లు దక్కించుకుంటుంది అని ఇండియా టుడే-సి ఓటర్ సర్వే తేల్చింది. ఇప్పటికే కాంగ్రెస్ 54 సీట్లలో అంటే ...మొత్తం అభ్యర్థులను ప్రకటించి.. నామినేషన్స్ కూడా పూర్తి అయిన తర్వాత...అసలైన ఎన్నికల నాటికి ఈ సంఖ్య కావాల్సిన మెజారిటీ నెంబర్ 60 ని దాటి పక్కాగా స్పష్టమైన మెజారిటీ దక్కించుకోవటం ఖాయం అని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రకటించిన ఆరు హామీలు ఈ ఎన్నికల్లో కీలక భూమిక పోషిస్తుంటే...మరో వైపు ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ కి కలిసి వస్తోంది అనే చర్చ సాగుతోంది.
2018 ఎన్నికల్లో కేవలం 19 సీట్లకు పరిమితం అయిన కాంగ్రెస్ ...ఈ సారి 35 సీట్లను పెంచుకుని 54 కు పెంచుకోనుంది. అదే అధికార బిఆర్ఎస్ సీట్లు 88 నుంచి 49 కు తగ్గనున్నట్లు ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనా వేసింది. గత ఎన్నికల సందర్భంగా రెండు ఎన్నికల్లో ప్రకటించిన రైతు రుణ మాఫీని ఈ సారి అధికార బిఆర్ఎస్ పక్కన పెట్టింది. అదే కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ఒకే సారి రెండు లక్షల రూపాయల రుణ మాఫీకి హామీ ఇచ్చింది. ఇది కూడా కాంగ్రెస్ కు ఎంతో కీలకం కానుంది. అదే సమయంలో బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ కౌలు రైతుల గురించి ఇటీవల బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు అధికార బిఆర్ఎస్ కు నష్టం చేసేవే అనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో కూడా ఉంది. మరో వైపు ధరణి పై వివిధ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంటే సీఎం కెసిఆర్ మాత్రం ప్రతి మీటింగ్ లో ధరణి అద్భుతం అని చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నారు. ధరణిపై కెసిఆర్ పెట్టిన ఫోకస్ ప్రజల్లో దీనిపై మరిన్ని అనుమానాలు పెంచేదిగా ఉంది అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది నిజంగా కెసిఆర్ చెపుతున్నట్లు ధరణి ప్రజలకు అంత మేలు చేసి ఉంటే...కెసిఆర్, కెటిఆర్ లు దీనిపై అంతగా వాళ్లకు చెప్పాల్సిన అవసరం ఉందా అన్న చర్చ కూడా నడుస్తోంది. మొత్తానికి ఇండియా టుడే-సి ఓటర్ సర్వే తో పాటు పలు అంశాల ప్రకారం చూసినా బిఆర్ఎస్ ఈ సారి గట్టెక్కటం కష్టమే అనే చర్చ అంతగా సాగుతోంది.