Telugu Gateway
Telangana

సీఎం కెసీఆర్ రాజీనామా సవాల్

సీఎం కెసీఆర్ రాజీనామా సవాల్
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ బిజెపి ప్రచారంపై మండిపడ్డారు. నిజాయతీలేని ప్రభుత్వాన్ని బద్నాం చేస్తారేమో కానీ..కెసీఆర్ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో బిజెపి తెలంగాణ సర్కారుపై అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. దుబ్బాకలో బ్రహ్మండమైన మెజారిటీతో విజయం సాధిస్తామని తెలిపారు. తెలంగాణలో 38, 64,751 మందికి ఒక్కొక్కరికి 2016 రూపాయల లెక్కన పింఛన్ అందజేస్తున్నామని తెలిపారు. కేంద్రం తరపున 6,95, 000 మందికి 200 రూపాయల లెక్కన మాత్రమే పింఛన్లు ఇస్తోందని తెలిపారు. ఏడాదికి తెలంగాణ పింఛన్లపై చేసే వ్యయం 11 వేల కోట్ల రూపాయలు అయితే, కేంద్రం చేసే వ్యయం కేవలం 105 కోట్ల రూపాయలు మాత్రమేనన్నారు. బిజెపి నేతలు మాత్రం పించన్ లో 1600 రూపాయలు కేంద్రం ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. పింఛన్ల విషయోం తాను చెప్పేది అబద్ధం అని ఎవరైనా నిరూపిస్తే ఒక్క నిమిషంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఇంటికిపోతానని సవాల్ విసిరారు.

రైతు వేదిక ప్రారంభించిన అనంతరం సీఎం కెసీఆర్ శనివారం నాడు జనగామలో జరిగిన సభలో మాట్లాడారు. బిజెపి నేతలకు ఓట్లు కావాలి తప్ప..ప్రజలు కాదన్నారు. రైతు పెద్దవాడే కానీ కూర్చొని మాట్లాడుకునేందుకు స్థలమే లేదని, అందుకే రైతు వేదికలను ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. రైతు వేదిక ఏర్పాటు వ్యవసాయ రంగంలో సరికొత్త అధ్యాయం అన్నారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడా రైతులకు ఒక వేదిక లేదని, తెలంగాణాలోనే తొలిసారి రైతుల కోసం భవనాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఉద్యమ సమయంలో రైతుల బాధలను చూసి కన్నీళ్లు పెట్టుకున్నానని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ రైతులను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

ఇతర దేశాల్లో మాదిరి మన దేశంలో రైతులకు సబ్సిడీ అందడం లేదని విమర్శించారు. రాష్ట్రాలకు అందించాలనుకున్నా కేంద్రం ఆంక్షలు అడ్డుపతున్నాయని ఆరోపించారు. ధాన్యానికి ఎక్కువ ధరలు ఇస్తామంటే ఎఫ్‌సీఐ వడ్లు కొనుగోలు నిలిపివేసిందన్నారు. రైతులను నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ధాన్యం సన్నవైనా, దొడ్డవైనా రూ.1,880లకే కొనుగోలు చేస్తామని ఎఫ్‌సీఐ చెబుతోందని, అంత కంటే ఎక్కువైతే ధాన్యం సేకరించేదే లేదని ఆంక్షలు విధించిందని గుర్తు చేశారు. కేంద్రం రైతులకు అన్యాయం చేస్తుందని విమర్శించారు. కేంద్రంపై రైతులు పిడికిలి పట్టి ఉద్యమించాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

Next Story
Share it