మంచు విష్ణు గెలుస్తాడని ముందే చెప్పా
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్యవహారంపై, సీనియర్ నటుడు మోహన్ బాబుపై తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ తలసాని శ్రీనివాసయాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికల్లో మంచు విష్ణు గెలుస్తాడని తాను పది రోజుల ముందే చెప్పానన్నారు. మా అభివృద్ధి కోసం మంచు విష్ణు తీసుకునే నిర్ణయాలకు ప్రభుత్వపరంగా అండగా ఉంటామన్నారు. మోహన్ బాబుకు కోపం ఎక్కువ అని అందరూ అంటారు. కానీ ఆయన కోపం, ముక్కుసూటి తనం వల్ల చాలా నష్టపోయారని వ్యాఖ్యానించారు. ఈ విషయం ఆయనకూ తెలుసన్నారు. మా తరపున కొత్తగా ఎన్నికైన ప్యానల్ సభ్యుల ప్రమాణ స్వీకారానికి తలసాని శ్రీనివాసయాదవ్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కెసీఆర్ సినిమా పరిశ్రమ అభివృద్ధిపై స్పష్టమైన విజన్ ఉందన్నారు. సినిమా పరిశ్రమ హైదరాబాద్ హబ్ గా ఉండాలని కెసీఆర్ తలంచారన్నారు. తలసాని వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే...'మా ఎన్నికలు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలను తలపించాయి. మా చిన్న అసోసియేషన్ కాదు.. ఇదో పెద్ద వ్యవస్థ. ఈ వ్యవస్థ ను ఓ యువకుడు తన భుజస్కంధాలపై వేసుకున్నాడు. మోహన్ బాబు, మంచు విష్ణు కు చదువు తో పాటు సంస్కారం నేర్పించాడు. మాకు మంచి టీం ను 'మా' సభ్యులు ఎన్నుకున్నారు. సంతోషం. విష్ణు కు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది.
సినిమా షూటింగ్‌ల కోసం సింగిల్ విండో విధానం ప్రవేశ పెట్టి అన్ని అనుమతులు ఒకేసారి ఇస్తున్నాం. టికెటింగ్ విషయంలో ఇబ్బందులు ఉన్నాయని ప్రొడ్యూసర్ చెప్తే ఆన్ లైన్ టికెటింగ్ కు అంకురార్పణ చేసింది తెలంగాణ ప్రభుత్వం. షూటింగ్‌కు అనువైన అనేక ప్రాంతాలను ప్రభుత్వం నిర్మించింది. కరోనా వల్ల సినిమా వాళ్ళు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. థియేటర్ లో సినిమా చూడాలని ప్రజలను కోరుతున్నాను. పైరసీ అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నాం. కళామతల్లి మన జీవితంతో పాటు సమాజ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తోంది. 900 కాదు 9000 వేల మందిని నడిపే సత్తా 'మా'కు ఉంది. కొత్త మా టీం ను సీఎం వద్దకు తీసుకెళ్తాము. హైదరాబాద్ లో సినిమా రంగంపై కొన్ని లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారు. కొత్త మా టీం సమిష్టిగా కృషి చేసి మా ను మరింత ముందుకు తీసుకెళ్తారని భావిస్తున్నామ్.. మా టీం వెనుక మేము ఉంటాం. ప్రభుత్వం తరపున అన్ని సంక్షేమ కార్యక్రమాలు కళాకారులకు వర్తించేలా చూస్తాం. మంచు విష్ణు గెలుస్తాడాని పది రోజుల ముందే చెప్పాను' అని అన్నారు.