Telugu Gateway
Telangana

జినోమ్ వ్యాలీలో వ్యాక్సిన్ టెస్టింగ్ కేంద్రం

జినోమ్ వ్యాలీలో వ్యాక్సిన్ టెస్టింగ్ కేంద్రం
X

కేంద్ర మంత్రికి కెటీఆర్ లేఖ

హైదరాబాద్ జినోమ్ వ్యాలీలో వ్యాక్సిన్ టెస్టింగ్, సర్టిఫికేషన్ లేబరేటరీ ఏర్పాటు చేయాలని తెలంగాణ పరిశ్రమలు, ఐటి శాఖల మంత్రి కెటీఆర్ కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి హర్షవర్ధన్ కి లేఖ రాశారు. జినోమ్ వ్యాలీ ప్రపంచ వ్యాక్సిన్ తయారీ రాజధానిగా ఉందని తన లేఖలో పేర్కొన్నారు. 60 బిలియన్ డోసులను ఇక్కడి కంపెనీలు తయారు చేస్తున్నాయని తెలిపారు. అందుకే ప్రధాని మోడీతో సహా 85 దేశాలకు చెందిన రాయబారులు జీనోమ్ వ్యాలీలో పర్యటించారన్నారు. భారతదేశ వ్యాక్సిన్ తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా కేంద్రం వెంటనే ఈ రెండు నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.

దేశంలోనే అత్యధికంగా వ్యాక్సిన్లను తయారుచేస్తున్న జినోమ్ వ్యాలీలో వ్యాక్సిన్ టెస్టింగ్ మరియు సర్టిఫికేషన్ లాబరేటరీని ఏర్పాటు చేయాలని గతంలో ఒకసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని, ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో వ్యాక్సిన్ తయారీకి సంబంధించి మరింత వేగంగా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో వెంటనే ఇక్కడ ప్రత్యేకంగా టెస్టింగ్ లేబరేటరీ ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం దేశంలో వ్యాక్సిన్ ల తయారీకి సంబంధించి సెంట్రల్ డ్రగ్ లేబరేటరీ హిమాచల్ ప్రదేశ్ లోని కసౌలి లో ఉన్నదని, ప్రతి సారి అక్కడికి తమ వ్యాక్సిన్లను పంపి పరీక్షించడం, సర్టిఫికేషన్ పొందడంలో హైదరాబాద్ బయోటెక్ కంపెనీలు సమయాభావాన్ని ఎదుర్కొంటున్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.

Next Story
Share it