తెలంగాణలో 'ఆర్ఆర్ఆర్' కు స్పెషల్ బాదుడు
దానయ్య అడిగారు. తెలంగాణ సర్కారు ఓకే అనేసింది. పేరుకు లేఖ డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ అని ఉంటుంది కానీ..తెర వెనక జరిగే తతంగాలే వేరు. ప్రభావితం చేసేవాళ్లు వేరు. ఇప్పటికే తెలంగాణాలో సినిమా టిక్కెట్ ధరలను అడ్డగోలుగా పెంచేశారు. ఆర్ఆర్ఆర్ కు మళ్ళీ ప్రత్యేక బాదుడు. ఇందుకు సర్కారు ఓకే అనేసి ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలోని ఎయిర్ కండిషన్డ్-ఎయిర్ కూల్డ్ థియేటర్లలో మూడు రోజుల పాటు అంటే మార్చి 25 నుంచి 27 వరకూ సినిమా టిక్కెట్ రేట్లను 50 రూపాయల మేర పెంచుకోవటానికి అనుమతించారు. మళ్ళీ 28 నుంచి ఏప్రిల్ 3 వరకూ మాత్రం 30 రూపాయలు పెంచుకునే సౌలభ్యం కల్పించారు.
సింగిల్ థియేటర్లలోని రిక్లైనర్ సీట్లు, మల్టీఫ్లెక్స్ ల్లో మాత్రం తొలి మూడు రోజులు వంద రూపాయలు, ఆ తర్వాత వారం రోజులు 50 రూపాయలు పెంచుకోవచ్చట. ఇతర విభాగాల్లో అంటే నాన్ ఏసీ కేటగిరిల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవని తెలిపారు. దీంతో పాటు తెలంగాణలో ఐదు షోలకు అనుమతి మంజూరు చేశారు. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకూ షోలు వేసుకోవచ్చన్నారు. ఒకప్పుడు ఐమ్యాక్స్ లో 150 రూపాయలు ఉన్న ధర పెద్ద సినిమాలకు మాత్రం 200 రూపాయలకు చేరేది. పెంచిన ధరలతో ఇది ఏకంగా మూడు వందల వరకూ చేరింది. ఇప్పుడు ఏకంగా మరో వంద రూపాయలు పెంచుకునే అవకాశం ఇవ్వటంతో మరింత పెరగటం ఖాయంగా కన్పిస్తోంది.