హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ లో మార్పులు అవసరం
ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) మాస్టర్ ప్లాన్ ను మార్పులు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం శాఖ మంత్రి సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అదే సమయంలో హెచ్.ఎం.డి.ఎ – స్థానిక సంస్థల మధ్య సమన్వయం పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు కిషన్ రెడ్డి గురువారం నాడు ముఖ్యమంత్రి కెసీఆర్ కు లేఖ రాశారు. అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు స్థానిక సంస్థలతో కలిసి ఉమ్మడిగా కార్యాచరణ రూపొందించాలని కోరారు. కిషన్ రెడ్డి లేఖలోని ముఖ్యాంశాలు... 'హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ అమలులో ప్రజలు, ముఖ్యంగా రైతులు ఆశించిన విధంగా ప్రణాళికలు అమలు జరగడం లేదని అనేక ఫిర్యాదులు నా దృష్టికి వచ్చాయి. పరిధి పెద్దగా ఉండడంతో పాటు క్షేత్ర స్థాయిలో సరైన అవగాహన లేక సంబంధిత స్థానిక సంస్థలతో సమన్వయ లోపం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
అక్రమ నిర్మాణాలు పెరుగుతూ క్రమ పద్దతిలో జరగవలసిన అభివృద్ధి అక్రమాలకూ, అవినీతికి అవకాశం కల్పిస్తున్నది. రైతులు కూడా మాస్టర్ ప్లాన్ తమకు అనుకూలంగా లేదని – భూములను వివిధ జోన్లుగా మార్చే విషయంలో తమ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని వాపోతున్నారు. రైతులు తమ భూములను ఇతర జోన్లకు అంటే, నివాస, పారిశ్రామిక, వ్యాపార తదితర జోన్లలోకి మార్చుకోవడానికి చాలా కాలం ఎదురుచూడాల్సి వస్తోంది. దీంతో అక్రమ నిర్మాణాలకు అవకాశం ఏర్పడుతోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత హెచ్.ఎం.డి.ఎ మాస్టర్ ప్లాన్ ను సమీక్షించి, రైతులకు అనుకూలంగా సమగ్ర మాస్టర్ ప్లాన్ ను రూపొందిస్తామని ప్రభుత్వం పలుసార్లు చెప్పింది. ఇది ఖర్చుతో కూడిన పని కూడా కాదు. మారిన పరిస్థితులకు అనుగుణంగా రైతులు, పేద, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని మార్పులు చేర్పులు చేయవలసిన అవసరం ఎంతైనా వుంది. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన భూములు తప్ప ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతంలోని మిగతా భూములన్నింటినీ నివాస (రెసిడెన్సియల్), జోన్లుగా మారిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని రైతులు భావిస్తున్నారు. హెచ్.ఎం.డి.ఎ సమగ్ర అభివృద్ధికి నా దృష్టికి వచ్చిన పిర్యాదుల / సమస్యల నేపథ్యంలో ఈ క్రింది సూచనలు పరిశీలించి పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాను. నిర్మాణ అనుమతులకై తీసుకువచ్చిన DPMS (Development Permission Management System) సమర్థవంతంగా అమలయ్యేట్టు చూడాలి.
ఘట్ కేసర్, గౌడవెల్లి, నాగులపల్లి, శంషాబాద్ ల వద్ద ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్లపై రైల్వే లైన్లు వచ్చిన ప్రదేశాల్లో బ్రిడ్జ్ లు నిర్మించడానికి చర్యలు తీసుకోవాలి. అన్ని రేడియల్ రోడ్లను పూర్తిచేయాలి. రాజేంద్రనగర్, శంషాబాద్, నార్సింగి, పటాంచెరు, శంబీపూర్ తదితర ప్రాంతాలలో సర్వీస్ రోడ్లను పూర్తిచేయాలి. ప్రధాన రింగ్ రోడ్డు, సర్వీస్ రోడ్లకు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలి. ఔటర్ రింగ్ రోడ్డుపై ఉన్న ప్రతి సూచికపై దూరాన్ని సైతం చూపించాలి. ఔటర్ రింగ్ రోడ్డు డివైడర్లపై చెట్లు పెంచడం, పొదలను తొలగించడం సరైన పద్ధతిలో చేయాలి. ' అని కోరారు.