2025 నవంబర్ లోనే పనులు మొదలు కావాలన్న సీఎం

ప్రజలకు రంగుల ప్రపంచం చూపించటంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర రాజకీయ నేతలకు తక్కువ ఏమీ కాదు. గత మూడేళ్ళుగా ఆయన పాలన సాగుతున్న తీరు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. అంతే కాదు..పరిస్థితి ఎలా మారింది అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెపుతారు...కానీ చేయరు అన్న చందంగా మారింది పలు కీలక ప్రాజెక్ట్ ల విషయంలో. తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దినెలలకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అదేంటి ఏంటి అంటే న్యూయార్క్‌లో ఎంతో పాపులర్ అయిన టైమ్స్ స్క్వేర్ తరహాలోనే తెలంగాణ ప్రభుత్వం రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో 'టి స్క్వేర్'ను అభివృద్ధి చేస్తుంది అని ఎంతో ఆర్భాటంగా ప్రకటించారు. ఈ టి స్క్వేర్ ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటుంది అని..ఇక్కడ బహుళ జాతి సంస్థలు కొలువుతీరటంతో పాటు నిత్యం సమావేశాలు జరిగేలా..ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఉండేలా దీన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.
టి స్క్వేర్ నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి 2025 నవంబర్ నుంచే పనులు ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సీఎం ఈ మాట చెప్పి ఏడాది దాటింది పనులు మొదలు పెట్టడం సంగతి అటుంచి అసలు ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన డిజైన్లు కూడా ఇప్ప్పటి వరకు ఖరారు అయిన దాఖలాలు కనిపించటం లేదు. అధికారులు కూడా టి స్క్వేర్ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి పురోగతి లేదు అని చెపుతున్నారు. ఈ ప్రాజెక్ట్ అమలు బాధ్యతను తెలంగాణ సర్కారు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) కి అప్పగించింది. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు టి స్క్వేర్ ప్రాజెక్ట్ విషయాన్ని పూర్తిగా మరిచిపోయినట్లే కనిపిస్తోంది. టి స్క్వేర్ ప్రాజెక్ట్ పూర్తి అయితే హైదరాబాద్ లో ఇది ఒక టాప్ టూరిస్ట్ హబ్ గా మారుతుంది అన్నారు.
ప్రస్తుత వాతావరణం చూస్తుంటే అసలు కాంగ్రెస్ ఈ టర్మ్ లో టి స్క్వేర్ ప్రాజెక్ట్ పూర్తి చేయటం జరిగే పని కాదు అని అధికారులు చెపుతున్నారు. ఇది ఒక్కటే కాదు తెలంగాణ సర్కారు ఎంతో హడావుడిగా హైదరాబాద్ మెట్రో రైల్ ను టేకోవర్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీని వల్ల ప్రభుత్వానికి ఎంతో మేలు జరుగుతుంది అని...అతి తక్కువ వడ్డీకే రుణాలు తెస్తున్నట్లు వెల్లడించారు. కానీ కేంద్ర ప్రభుత్వానికి చెందిన రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఆర్ఎఫ్ సి) రుణాలు మంజూరు చేసింది అని వెల్లడించారు. కానీ అవి విడుదల కావాల్సిన తరుణంలో బ్రేకులు పడ్డాయి. దీంతో ఇప్పుడు మొత్తం వ్యవహారం మొదటికి వచ్చింది. ఈ ప్రతిపాదన ద్వారా ఆదా సంగతి ఏమో కానీ...అంతా ఫైనల్ అయిన తర్వాత మెట్రో టేకోవర్ఆ గిపోవటం వల్ల ప్రభుత్వం భారీ ఎత్తున నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని అధికారులు చెపుతున్నారు. ఒక ప్లానింగ్ లేకుండా హడావుడిగా నిర్ణయాలు తీసుకోవటం ...ఆ తర్వాత దిక్కులు చూడటం రేవంత్ రెడ్డి సర్కారుకు అలవాటుగా మారిపోయింది అని అధికారులు కూడా నవ్వుకుంటున్నారు. ఇలా ఎన్నో విషయాల్లో ఎదురుదెబ్బలు తిన్నా కూడా ఏ మాత్రం మారటం లేదు అని చెపుతున్నారు.



