Telugu Gateway
Telangana

శంషాబాద్ విమానాశ్రయంలో ప్లాజా ప్రీమియం లాంజ్‌ పునరుద్ధరణ

శంషాబాద్ విమానాశ్రయంలో ప్లాజా ప్రీమియం లాంజ్‌ పునరుద్ధరణ
X

దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య సాధారణ స్థితికి చేరుతుండటంతో విమానాశ్రయాల్లో సర్వీసులు కూడా పూర్తి స్థాయిలో ప్రారంభం అవుతున్నాయి. అందులో భాగంగానే తాజాగా హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లో ప్లాజా ప్రీమియం లాంజ్ ను పునరుద్ధరించారు. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ లాంజ్‌లో ప్రయాణికుల కోసం వర్క్ స్టేషన్లు, వై-ఫై, ప్రత్యేక అతిథులు, విఐపీల కోసం ప్రైవేట్ సీటింగ్ జోన్, లాంజ్ సీటింగ్ వంటి సౌకర్యాలు ఉంటాయి. అంతే కాదు..లాంజ్ వద్ద సురక్షితమైన మసాజ్, వెల్‌నెస్ సదుపాయాన్ని ఎంచుకోవచ్చు. సుదీర్ఘ విమాన ప్రయాణానికి ముందు షవర్ సదుపాయాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ప్రీమియం ప్లాజా లాంజ్‌లోని రెక్లైనర్ సీట్లలో కూర్చుని విమానాశ్రయ రన్‌వే సుందర దృశ్యాలను వీక్చించవచ్చు. బార్ నుండి వారికిష్టమైన కాక్‌టెయిల్ లేదా మాక్‌టెయిల్‌ను సిప్ చేయవచ్చు. ప్రయాణీకులు ఎంపిక చేసుకోవడానికి బార్‌లో ప్రపంచ స్థాయి బ్రాండ్ల మద్యాలు లభిస్తాయని జీఎంఆర్ ఓ ప్రకటనలో తెలిపింది.

లాంజ్‌లో సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రయాణికులకు విశ్రాంతి, ఆందోళన లేని విమానాశ్రయ అనుభవాన్ని ఆస్వాదించడానికి విస్తృత బఫే ఏర్పాట్లూ ఇక్కడున్నాయి. ప్రయాణ సమయాన్ని బట్టి ప్రయాణీకులు లైవ్ ఫుడ్ కౌంటర్ల సదుపాయాన్నీ ఉపయోగించుకోవచ్చు. లాంజ్‌లో ఏర్పాటు చేసిన అనేక స్క్రీన్‌ల ద్వారా ప్రయాణీకులు తమ విమాన షెడ్యూల్‌ అప్‌డేట్ సమాచారాన్ని పొందవచ్చు. సిసిటివి కెమెరాల ద్వారా లాంజ్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నందున సాధారణ ప్రయాణికులతో పాటు విఐపిలు, ప్రత్యేక అతిథులకు కూడా అత్యధిక భద్రత లభిస్తుంది. ప్రయాణీకుల అవసరాలను తీర్చడానికి, వారి ప్రయాణ అనుభవాన్ని మరపురానిదిగా చేయడానికి ఈ లాంజ్ 24 గంటలూ తెరిచి ఉంటుందని తెలిపారు.

Next Story
Share it