Telugu Gateway

నేనే సీఎం..కుండబద్దలు కొట్టిన కెసీఆర్

నేనే సీఎం..కుండబద్దలు కొట్టిన కెసీఆర్
X

'నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నా. పదేళ్ళు నేనే సీఎంగా ఉంటా. సీఎం మార్పు గురించి పదే పదే ఎందుకు మీడియాలో మాట్లాడుతున్నారు. సీఎం మార్పు గురించి ఎవరూ బయట మాట్లాడొద్దు. హద్దుమీరి మాట్లాడితే చర్యలు తప్పవు' అంటూ హెచ్చరించారు టీఆర్ఎస్ అధినేత, సీఎం కెసీఆర్. ఆదివారం నాడు హైదరాబాద్ లో జరిగిన టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో సీఎం కెసీఆర్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొంత కాలంగా తెలంగాణ కేబినెట్ లోని మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు కూడా కాబోయే సీఎం కెటీఆర్ అంటూ వరస ప్రకటనలు చేస్తున్న తరుణంలో కార్యవర్గ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. గతానికి భిన్నంగా కార్యవర్గ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని పదవుల్లో ఉన్న నాయకులను ఆహ్వానించారు. దీంతో ఈ సమావేశంలో కీలక ప్రకటన ఉంటుందని అందరూ భావించారు. కానీ అందుకు భిన్నంగా కెసీఆర్ హెచ్చరిక తీరులో ప్రకటన చేశారు.

అంతే కాదు..ఎవరైనా ఇక సీఎం మార్పు అంశంపై మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. తనకు అరోగ్యం బాగాలేకపోతే ఆ విషయం చెపుతానని..అప్పుడు అందరితో మాట్లాడుతాన్నారు. టీఆర్ఎస్ నేతల ప్రకటనలతో రాష్ట్రంలోని ప్రతిపక్షాలు కూడా అస్త్రాలుగా మార్చుకుని సీఎం కెసీఆర్ ఇఫ్పటికైనా దళిత సీఎం హామీని నెరవేర్చాలని కొంత మంది, ఈటెల రాజేందర్, రసమయి బాలకిషన్ వంటి వారికి పదవులు ఇవ్వాలంటూ డిమాండ్లు చేశారు. అయితే కెసీఆర్ తాజా ప్రకటనతో ఈ చర్చకు బ్రేక్ పడినట్లు అయింది. మరి ఇది ఎంత వరకు ఆగుతుంది?. కెసీఆర్ అదను చూసి నిర్ణయం తీసుకుంటారా? లేక ఇదే అంతిమ నిర్ణయమా అన్నది తేలాలంటే కొంత కాలం ఆగాల్సిందే.

Next Story
Share it