Telugu Gateway
Telangana

కెసిఆర్ వైపు ఇక అందరూ అనుమానపు చూపులే!

కెసిఆర్ వైపు ఇక అందరూ అనుమానపు చూపులే!
X

టీఆర్ఎస్ పార్టీ లో ఇప్పుడు ఇదో కొత్త చర్చ. కెసిఆర్ ను రాజకీయాల్లో ఇక ఎవరైనా నమ్ముతారా అని. ఫస్ట్ ఓటుకు నోట్ కేసు. ఇప్పుడు అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంఎల్ఏలతో సాగిన బేరసారాల వ్యవహారం అంతా ఆడియో, వీడియోల రికార్డింగ్. అంతా పక్కా ప్లాన్ ప్రకారం చేసినట్లు తేలిపోతోంది. బీజేపీ వెనక ఉండి ఇది అంతా నడిపించింది అని స్పష్టం అవుతోంది అని టీఆర్ఎస్ పార్టీ చెప్పుకోవచ్చు. దేశంలో ఎవరికీ చేతకాని పని తాము చేశాం అని గొప్పలు క్లెయిమ్ చేసుకోవచ్చు. మొయినాబాద్ ఫార్మ్ హౌస్ లో ముందుగానే ట్రాప్ చేయటానికి అన్ని ఏర్పాట్లు చేశారు. తెలంగాణ పోలీసులు కూడా కోర్ట్ కు ఈ విషయం స్పష్టం చేశారు. ముందుగా వచ్చిన సమాచారం ప్రకారమే ఇలా ఆడియో, వీడియో రికార్డింగ్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారం లీగల్ గా చెల్లుబాటు సంగతి పక్కన పెడితే ఇది టీఆర్ఎస్ పార్టీకి మునుగోడు ఉప ఎన్నికలో ఏమైనా మేలు చేస్తుందా లేదా అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. ఇది అంతా ఒక ఎత్తు అయితే భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తో దేశ రాజకీయాల్లోకి ప్రవేశించి బీజేపీ ని ఓడిస్తాను అని చెపుతున్న కెసిఆర్ కు ఇది పెద్ద దెబ్బగా మారటం ఖాయం అని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. రాజకీయాల్లో, ముఖ్యంగా అధికారంలో ఉన్న ప్రభుత్వాల్లో చాలా విషయాలు జరుగుతుంటాయి. ఇందులో బయటకు వచ్చేవి చాలా తక్కువ, ఏదైనా సమాచారం వచ్చినా దాన్ని ధృవీకరించే ఆధారాలు అంత తొందరగా దొరకవు. ఎక్కువ శాతం పరస్పర నమ్మకం పైనే నడిచి పోతాయ్. గతం లో వోట్ కు నోట్ కేసు అయినా..ఇప్పుడు ఎంఎల్ఏలతో సాగిన బేరసారాల విషయాన్ని ఎవరు సమర్ధించరు. అయితే ఇదే కెసిఆర్ ఫిరాయింపులపై ఒకప్పుడు చాలా చాలా విషయాలు మాట్లాడి తర్వాత అవసరం లేక పోయినా అన్ని పార్టీల ఎంఎల్ఏలను టీఆర్ఎస్ లో చేర్చుకున్న విషయం తెలిసిందే.

ఇందులో కాంగ్రెస్, టీడీపీ, వైస్సార్సీపీతో పాటు ఇతర పార్టీల వాళ్ళు ఉన్నారు. అధికారంలో ఉన్నారు కాబట్టి అభివృద్ధి అనే పదార్ధం పేరు చెప్పి అంతా చేరిపోయారు. కానీ తెరవెనక చాలా విషయాలు చాలా జరిగాయనే ప్రచారం అయితే ఉంది. కెసిఆర్ చేసినట్లుగా ప్రతిపక్షాలు చేయలేవు..ఎందుకు అంటే వాళ్లకు ఛాన్స్ ఉండదు కూడా. కానీ తాజా గా తెలంగాణలో చోటు చేసుకున్న పరిణామాలు అన్నీ జాతీయ స్థాయిలో కెసిఆర్ ని ప్రతి ఒక్కరు అనుమానంతో చూసేలా చేస్తాయనే అభిప్రాయాన్ని ఆ పార్టీకే చెంది సీనియర్ నేత ఒకరు వ్యక్తం చేశారు. ఒక్క జాతీయ స్థాయి నేతలే కాదు ఇప్పుడు అధికారుల దగ్గర నుంచి సొంత పార్టీ నేతలు కూడా కెసిఆర్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితిని కల్పించింది అని చెపుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని సోనియా గాంధీ కి హామీ ఇచ్చి అప్పటికే ఎంతో మందికి ఝలక్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కే కెసిఆర్ ఝలక్ ఇచ్చారని..ఈ కారణంగా జాతీయ స్థాయిలో అంత తొందరగా కెసిఆర్ ను ఎవరూ నమ్మరని మరో నేత తెలిపారు. తాజా పరిణామాలతో ఇది మరింత దారుణంగా మారే అవకాశం ఉండనే అభిప్రాయాలు ఆ పార్టీ నేతల్లోనే వ్యక్తం అవుతున్నాయి. జాతీయ రాజకీయాల్లో ముందుకు వెళ్లాలంటే అందరిని కలుపుకుని వెళ్ళాలి. కానీ కెసిఆర్ అందరిపై నిఘా పెడతారు అనే అనుమానాలు ఒక సారి వచ్చాయంటే అవి అంత తొందరగా పోవు అని ఒక కీలక నేత వెల్లడించారు. ఇది రాజకీయంగా లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తుంది అనే అనుమానాలు ఆ పార్టీ నాయకుల్లో ఉన్నాయి.

Next Story
Share it