Telugu Gateway
Telangana

జీహెచ్ఎంసీ ఎన్నికలు డిసెంబర్ 1న

జీహెచ్ఎంసీ ఎన్నికలు డిసెంబర్ 1న
X

కౌంటింగ్ డిసెంబర్ 4న

బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు

అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ ) ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్ధసారధి ఎన్నికల షెడ్యూల్ ను వెల్లడించారు. డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ పోలింగ్ జరగనుంది. నాలగవ తేదీన కౌంటింగ్ ఉంటుంది. మంగళవారం నాడే నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతాయి. నవంబర్ 18,19,20 తేదీల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 20 నామినేషన్లకు చివరి రోజు. నవంబర్21న నామినేషన్ల పరిశీలన, 22న ఉపసంహరణ తేదీగా నిర్ణయించారు. ఎక్కడైనా అవసరం అయితే డిసెంబర్ 3న రీపోలింగ్ నిర్వహిస్తారు. వాస్తవానికి ప్రస్తుతం జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు ఫిబ్రవరి వరకూ ఉన్నా మారిన రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం వేగంగా ఈ ఎన్నికలు పూర్తి చేయాలని నిర్ణయించుకుంది.

ప్రత్యర్ధి రాజకీయ పార్టీలకు కావాల్సిన సమయం ఇవ్వకుండా వేగంగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి..తర్వాత అధికారంలో ఉన్న పార్టీగా హంగులు అన్నీ ఉపయోగించుకోవటానికి రెడీ అయింది. గ్రేటర్ లో మొత్తం 74 లక్షల 4 వేల 286 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 38 లక్షలపైన ఉంటే..మహిళల సంఖ్య35 లక్షలకుపైగా ఉన్నారు. జీహెచ్ఎంసీలో మొత్తం 9248 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. గ్రేటర్ లో మొత్తం 150 వార్డులు ఉన్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఈ సారి జీహెచ్ఎంసీ ఎన్నికలు ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పద్దతిలో నిర్వహించనున్నారు. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తున్నామని కమిషనర్ పార్ధసారధి వెల్లడించారు. చట్టప్రకారమే ఎన్నికల నిర్వహణ సాగుతుందన్నారు. జీహెచ్ఎంసీ మేయర్ పదవి జనరల్ మహిళకు కేటాయించారు.

.

Next Story
Share it