Telugu Gateway
Telangana

అప్పుడు తిట్టి..ఇప్పుడు పక్కన తిప్పుకుంటున్నారు!

అప్పుడు తిట్టి..ఇప్పుడు పక్కన తిప్పుకుంటున్నారు!
X

రాష్ట్రం ఏదైనా..ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వం ఏదైనా ఆ కంపెనీతో అలా కనెక్ట్ అయిపోవాల్సిందేనా?. అంతకు ముందు దారుణంగా విమర్శలు చేసిన వాళ్ళు కూడా అన్నీ మర్చిపోయి ఆ కంపెనీతో ఎందుకు చేతులు కలుపుతున్నారు?. దీని వెనక ఉన్న మ్యాజిక్ ఏంటి అన్నదే ఇప్పుడు తెలంగాణ లో కూడా హాట్ టాపిక్ మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరినైతే దారుణంగా తిట్టారో వాళ్లనే ఇప్పుడు పక్కన తిప్పుకుంటున్నారు. అది కాంట్రాక్టర్లు కావొచ్చు...ఐఏఎస్ అధికారులు కావొచ్చు. ఈ వ్యవహారం కొంత మంది ఆయన క్యాబినెట్ సహచరులకు..కాంగ్రెస్ నేతలకు కూడా ఏ మాత్రం రుచించటం లేదు. కానీ అంతా గప్ చుప్ అన్న చందంగా ఎవరి పని వాళ్ళు చేసుకుపోతున్నారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేఘా ఇంజనీరింగ్ కంపెనీ పై చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. కంపెనీ తో పాటు ఆ కంపెనీ అధినేత మేఘా కృష్ణా రెడ్డి పై కూడా విమర్శలు గుప్పించారు. కెసిఆర్ తో కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటూన్నారు అని ఆరోపించారు. సీన్ కట్ చేస్తే తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పరిస్థితిలో ఏ మాత్రం మార్పులేకపోగా...ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి తాను ప్రతిపక్షంలో ఉండగా దారుణంగా తిట్టిన..పెద్ద ఎత్తున విమర్శలు చేసిన మేఘా ఇంజనీరింగ్ కంపెనీ పై ఈగ వాలకుండా చూస్తున్నారు అనే చర్చ మంత్రుల్లో సాగుతోంది.

ఒక్క సారిగా ఇంతలా మార్పు రావటం వెనక ప్రధాన కారణం తెర వెనక జరిగిన డీల్స్ అనే చర్చ కూడా ఆ పార్టీ నేతల్లో ఉంది. అందుకే గతంలో మేఘా పై పేరు పెట్టి విమర్శలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు అని చెపుతున్నారు. ఇప్పుడు ఎవరూ కూడా ఆ కంపెనీ పేరు ఎత్తటానికి కూడా సాహసించటం లేదు. శనివారం అసెంబ్లీ లో నదీ జలాల అంశం పై చర్చ జరిగినప్పుడు ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ పేరు పెట్టకుండానే బిఆర్ఎస్ పదేళ్ల హయాంలో ఒకే కుటుంభం ...ఒకే కంపెనీ భారీ ఎత్తున లబ్ది పొందాయని చెపుతూ ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు. ఇదే కంపెనీ ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పెద్ద ఎత్తున నిధులు సమకూర్చింది అన్నారు. రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలో కూడా ఆ కంపెనీ ఇదే పని చేసింది అని చెపుతూ సీఎం రేవంత్ రెడ్డి ని ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం నవ్వుతూ విన్నారే తప్ప సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై స్పందించలేదు.

ఇక్కడ మరో విచిత్రం ఏమిటి అంటే బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ బాటలోనే ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మేఘా ఇంజనీరింగ్ కంపెనీ కే పెద్ద పీట వేస్తున్నారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తో పాటు రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత కూడా ఈ కంపెనీకి రోడ్లతో పాటు వేల కోట్ల రూపాయల ఇతర ప్రాజెక్ట్ లు కేటాయిస్తూ పోతున్నారు. తెలంగాణ పై పెను భారం మోపిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించి మోటార్లు, పంప్ ల విషయాన్ని విచారణ పరిధి నుంచి తప్పించినప్పుడే మేఘా ఇంజనీరింగ్ ని రక్షించటానికి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు అనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించాయి. ఒక్క కాంట్రాక్టు ల విషయంలోనే కాదు...కొంత ఐఏఎస్ అధికారులపై కూడా రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్లనే కీలక స్థానాల్లో నియమించటంతో పాటు వాళ్ళతో కలిసి పలు వ్యవహారాలు నడిపిస్తున్నట్లు ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Next Story
Share it