Telugu Gateway
Telangana

అప్పుడు తప్పించుకున్నా.. కెసిఆర్ కు ఇప్పుడు కుదరలేదు

అప్పుడు తప్పించుకున్నా.. కెసిఆర్  కు ఇప్పుడు కుదరలేదు
X

అధికారంలో ఉన్న పదేళ్లు బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎలా వ్యవహరించారో తెలంగాణ ప్రజలంతా చూశారు. అధికారం నుంచి దిగిపోయిన తర్వాత కూడా అదే ధోరణి చూపిస్తూ వచ్చారు. ఏడాదిన్నర క్రితం తెలంగాణాలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సవాల్ చేస్తూ కోర్టు లను ఆశ్రయించారు. విద్యుత్ కమిషన్ విషయంలో కోర్టు ల్లో కూడా కెసిఆర్ కు చుక్కెదురు అయింది. కారణాలు ఏమైనా విద్యుత్ కమిషన్ ముందు హాజరు నుంచి తప్పించుకున్న కెసిఆర్ కు ఇప్పుడు మాత్రం కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కాకతప్పలేదు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ సారి కాళేశ్వరం పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ నోటీసులు జారీ చేసినా ఒక సారి గడువు కోరటం తప్ప...ఎలాంటి ఇతర ప్రయత్నాలు చేయలేదు. చివరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి కాళేశ్వర రావు గా పేరు తెచ్చుకున్న కెసిఆర్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో చోటు చేసుకున్న అక్రమాలను నిగ్గుతేల్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ ముందు హాజరు అయ్యారు.

అటు విద్యుత్ కొనుగోళ్లు...విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం , కాళేశ్వరం ప్రాజెక్టు పనులు అన్ని కూడా అంతా పద్ధతి ప్రకారం జరిగాయి తప్ప...ఎలాంటి ఉల్లంఘనలు లేవు..తమను ఎవరూ ప్రశ్నించలేరు అన్న రీతిలో కెసిఆర్ తో పాటు బిఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రులు అంతా వ్యవహిస్రిస్తూ వచ్చారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఉన్న విమర్శలు అన్ని ఇన్ని కావు. కాళేశ్వరం కమిషన్ ఫైనల్ గా ప్రభుత్వానికి ఏమి రిపోర్ట్ ఇస్తుంది?. దీని ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నది తేలటానికి కొంత సమయం పడుతుంది. కెసిఆర్ ను కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టడం మాత్రం రేవంత్ రెడ్డి సర్కారు విజయంగానే చెప్పాలి. తనను ఎవరూ ప్రశ్నించలేదు..తాను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అన్న కెసిఆర్ ఒక్క మాట మాట్లాడకుండా కమిషన్ ముందు హాజరు అయి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి వెళ్లాల్సి వచ్చింది.

బిఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నట్లు నిజంగా కాళేశ్వరం కమిషన్ ఎలాంటి కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించలేదు అనే విషయం గంట లోపే కెసిఆర్ ను బయటకు పంపారు అంటేనే తెలిసిపోతుంది అనే అభిప్రాయాన్ని అధికారులు కూడా వ్యక్తం చేస్తున్నారు. నిజంగా వేధించాలి అనుకుంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే కూర్చో పెట్టి రకరకాల ప్రశ్నలు వేసే అవకాశం ఉన్నా కూడా అలా చేయలేదు అనే విషయం స్పష్టంగా కనిపించింది. ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కారు చేతికి విద్యుత్ కమిషన్ నివేదిక చేరింది. కొద్దీ రోజుల్లోనే కాళేశ్వరం పై ఏర్పాటు అయినా ఘోష్ కమిషన్ కూడా తన నివేదిక ను సమర్పించనుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రెండు అంశాలపై తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ ఈ కమిషన్ నివేదికలపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నది ఇప్పుడు కీలకం కాబోతుంది.

Next Story
Share it