సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ మృతి
సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ మంగళవారం నాడు కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గుండా మల్లేష్ కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులతో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుండా మల్లేష్ మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులు, కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు. గుండా మల్లేశ్ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం నారాయణగూడలోని మక్దూమ్ భవన్‌కు తరలించనున్నారు. అనంతరం మల్లేశ్ భౌతికకాయాన్ని ఆయన సొంత ఊరు బెల్లంపల్లికి తరలిస్తారు.
కార్మిక కుటుంబం నుంచి వచ్చిన గుండా మల్లేష్ అంచెలంచెలుగా శాసన సభ్యులు స్థాయికి ఎదిగారు. ఆదిలాబాద్ జిల్లా తాండూరు మండలం రేచిని గ్రామానికి చెందిన మల్లేశ్ మెట్రిక్యులేషన్ చదివి, బెల్లంపల్లిలోని రామా ట్రాన్స్ పోర్టులో క్లీనర్‌గా, డ్రెవర్‌గా పనిచేశారు. 1970లో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారారు. మంచి కార్మిక నేతగా పేరు తెచ్చుకున్న ఆయన 1983లో ఆసిఫాబాద్ నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. 1985, 1994 ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 12వ శాసనసభలో 2009లో బెల్లంపల్లి నుంచి ఎన్నికై సీపీఐ సభానాయకుడిగా వ్యవహరించారు.