Telugu Gateway
Telangana

ప్లాన్ ప్రకారమే చేశారా!

ప్లాన్ ప్రకారమే చేశారా!
X

తెలంగాణా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం నాడు కావాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని అవమానించారా?. ఆయన బలహీన సీఎం..ఆయన కంటే తామే గొప్ప అనే సంకేతం ప్రజలకు ఇవ్వాలనుకున్నారా?. రాజకీయంగా వీళ్ళిద్దరూ సీఎం రేవంత్ రెడ్డి కంటే సీనియర్ లు అయి ఉండొచ్చు?. కానీ ముఖ్యమంత్రి పదవి కి కనీస గౌరవం ఇవ్వాలి కదా?. విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ఆయన తన అధికారిక అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించటం అంశంపైనే మాట్లాడారు. ఈ మీడియా సమావేశానికి ఇతర మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీతక్క, మరికొంత మంత్రులు హాజరు అయ్యారు. అదే మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ల కోసం రెండు సీట్లు ఖాళీగా ఉంచారు కూడా. సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ మొదలైనా కూడా వీళ్లిద్దరు రాకపోవటంతో ఆ సీట్ల లో అప్పటికే అక్కడ ఉన్న మంత్రులు కూర్చున్నారు.

విచిత్రం ఏమిటి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ స్టార్ట్ అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ లు రెడ్డిలు ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. అప్పటికే మాట్లాడటం మొదలు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి కొద్ది సేపు బ్రేక్ తీసుకుని మళ్ళీ తన ప్రెస్ మీట్ కొనసాగించారు. రాజకీయంగా మంత్రుల మధ్య ఎన్ని విబేధాలు అయినా ఉండొచ్చు అని ...కానీ ముఖ్యమంత్రిని ఇలా బహిరంగంగా ప్రెస్ మీట్ లైవ్ జరుగుతున్నప్పుడు భట్టి, ఉత్తమ్ ఇలా చేయటం ఏ మాత్రం సరికాదు అని సీనియర్ నేతలతో పాటు ఐఏఎస్ అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఒక్క కాంగ్రెస్ పార్టీలో తప్ప ఎక్కడా ఇలాంటిపద్ధతులు ఉండవు అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ ముఖ్యమంత్రి తో పాటు ఆయన ఫ్యామిలీ పై చేసిన తీవ్ర విమర్శలతో రేవంత్ రెడ్డి ఇరకాటంలో ఉన్నారు. ఈ తరుణంలో ఇద్దరు సీనియర్ మంత్రులు వ్యవహరించిన తీరు తీవ్ర చర్చనీయంశంగా కూడా మారింది. ఇది అంతా ఉద్దేశపూర్వకంగా చేసినట్లు కనిపిస్తోంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Next Story
Share it