Telugu Gateway
Telangana

ధరణి పోర్టల్ భారత దేశానికి ట్రెండ్ సెట్టర్

ధరణి పోర్టల్ భారత దేశానికి ట్రెండ్ సెట్టర్
X

తెలంగాణ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ధరణి పోర్టల్ ను ముఖ్యమంత్రి కెసీఆర్ గురువారం నాడు ప్రారంభించారు. మేడ్చల్‌ జిల్లా మూడు చింతలపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో సీఎం కెసీఆర్ దీన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 570 (హైదరాబాద్‌ జిల్లా మినహా) మండలాల్లో ఈ సేవలు గురువారం నుంచి రైతులకు అందనున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా జారీ చేసిన 59.46 లక్షల ఖాతాలు... 1.48 కోట్ల ఎకరాల విస్తీర్ణానికి సంబంధించి మాత్రమే రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. నవంబర్‌ 2 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. ఆన్‌లైన్‌ విధానంలో ఒకేసారి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరుగనున్నాయి. ధరణి పోర్టల్ ప్రారంభం సందర్భంగా కెసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవి ఆయన మాటల్లోనే...'మూడుచింతలపల్లికి ప్రత్యేకమైన గౌరవం దక్కింది.

1969లో తెలంగాణ కోసం పోరాటం చేసిన వీరారెడ్డి పురిటిగడ్డ మూడుచింతలపల్లి. తెలంగాణ కోసం జైలు పాలైన వారిలో వీరారెడ్డి ఉన్నారు అందుకే ఈ..గ్రామాన్ని ఎంచుకున్నాం. ధరణిపోర్టల్‌ భారతదేశానికే ట్రెండ్‌ సెట్టర్‌. 30 దేశాల్లో ప్రజలు నా ఉపన్యాసం వింటున్నారు. అక్కడొక్కడు.. ఇక్కడొక్కడు.. కిరికిరిగాల్లు ఉంటారు. వాళ్ళతోనే కష్టం. రామ..రావణ ఉద్యమంలో ఆయుష్షు తీరకుండా చచ్చిపోయిన రాక్షసులు ఊరికో ఇద్దరు ముగ్గురు మళ్ళీ పుట్టిండ్రు.. వాళ్ళే ఈ..కిరి..కిరి గాళ్ళు. మనుషులెక్కనే ఉండే రాక్షసులు.. వాళ్ళే ప్రతి చిన్నదాన్ని గందరగోళం చేసే ప్రయత్నం చేస్తరు.. జాగ్రత్త. సంకల్పం ఉంటే సాదించలేనిది ఏది లేదని నిరూపించాము. సాలార్ జంగ్.. తర్వాత పివి నరసింహారావు భూసంస్కరణలు చేశారు.

తర్వాత ఎన్టీఆర్ పట్వారీ..పటేల్ వ్యవస్థను తీసేసారు.. మద్యలో.. ఎవరు పట్టించుకోలేదు.. సీఎస్‌, సీఎంవో కార్యదర్శులు, రెవెన్యూ అధికారులు మూడేళ్లు శ్రమించి ధరణి రూపకల్పన చేశారు. 570 తహసీల్దార్‌ కార్యాలయాలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా మార్పు. కేసీఆర్ బతికున్నన్ని రోజులు రైతుబందు ఆగదు. కౌలురైతు మా..దృష్టిలో ఉండడు.. రైతుల మెడమీద కత్తులు వద్దు. సాదాబైనామాలకు చిట్టచివరి అవకాశం ఇచ్చినం.. ఇక మీదట భూమి మారాలంటే రిజిస్ట్రేషన్ ద్వారానే.. ఇంకో వారం టైం ఇస్తున్నా.. తర్వాత సాదాబైనామా ఉండనే ఉండదు. విఆర్వోలను ఏం..చేస్తారు.. కిరికిరిగాల్ల ప్రశ్న. మాకు తెలియదా వాల్లను ఏంచేయాలో.. గంగలవేస్తమా.? వాళ్ళు మా..బిడ్డలు. వాళ్ళను వివిధ విభాగాల్లో సర్దుబాటు చేస్తాం' అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it