ఒప్పందం ఫోటో లో రేవంత్ మిస్సింగ్ వెనక కథ ఏంటో !
మేఘా ఇంజనీరింగ్ కంపెనీ తెలంగాణలో కొత్తగా వివిధ రంగాల్లో పదిహేను వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వంతో దావోస్ లో అవగాహనా ఒప్పందం చేసుకుంది. ఈ కొత్త ప్రాజెక్ట్ ల్లో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ తో పాటు వరల్డ్ క్లాస్ వెల్ నెస్ రిసార్ట్ ప్రాజెక్ట్ వంటివి ఉన్నాయి. సహజంగా ఇలాంటి పెట్టుబడుల ఒప్పందాల సమయంలో ముఖ్యమంత్రులు కూడా ముందు వరసలో ఉంటారు. కానీ ఇదేమి విచిత్రమో కానీ మేఘా ఇంజనీరింగ్ ఒప్పందం సమయంలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేరు. కేవలం పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ లు మాత్రమే ఈ ఒప్పందాల మార్పిడి సమయంలో ఉన్నారు. అయితే హైదరాబాద్ కేంద్రంలో వివిధ రంగాల్లో విస్తరించి ఉన్న మేఘా ఇంజనీరింగ్ తో ఒప్పందం కోసం దావోస్ పోవాల్సిన అవసరం ఉందా అనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. దీంతో పాటు ఈ ఒప్పందం సమయంలో సీఎం రేవంత్ రెడ్డి లేకపోవటం మరింత ఆసక్తికర చర్చ కు కారణం అవుతోంది.
మేఘా ఇంజినీరింగ్ కంపెనీ పై గతంలో రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.. ముఖ్యం గా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మేఘా ఇంజనీరింగ్ పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడింది అంటూ రేవంత్ రెడ్డి పలు మార్లు విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఆయనే తెలంగాణాలో పలు కొత్త ప్రాజెక్ట్ లు కూడా మేఘా కు ఇస్తున్నారు. ఈ విమర్శలకు భయపడే రేవంత్ రెడ్డి మేఘా తో ఒప్పందం సమయంలో స్కిప్ చేసినట్లు ఉంది అనే చర్చ సాగుతోంది. హైదరాబాద్ కు చెందిన మరో కంపెనీ స్కై రూట్ ఏరో స్పేస్ కూడా 500 కోట్ల రూపాయల పెట్టుబడితో తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. వీరితో పాటు మరో దిగ్గజ కంపెనీ యూనిలీవర్ తో కూడా తెలంగాణ సర్కారు కీలక ఒప్పందం కుదుర్చుకుంది. కామారెడ్డి జిల్లాలో ఆయిల్ పామ్ ఉత్పత్తి కేంద్రం, మరోచోట బాటిల్ క్యాప్ లను తయారు చేసే యూనిట్ ను ఏర్పాటు చేయనుంది.
ఎఫ్ఎంసీజీ రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన యునిలీవర్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యుటివ్ ఆఫీసర్ హెయిన్ షూమాకర్, చీఫ్ సప్లయి చైన్ ఆఫీసర్ విల్లెం ఉయిజెన్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జరిపిన చర్చల అనంతరం ఈ మేరకు ఒప్పందం కుదిరింది. స్కై రూట్ తో పాటు యునిలీవర్ చర్చలు..ఒప్పందాల సమయంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఒక్క మేఘా ఒప్పందం లోనే మిస్ కావటం ఇక్కడ కీలకం. అయితే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఇప్పటి వరకు ఆంధ్ర ప్రదేశ్ తో పోలిస్తే తెలంగాణ కే దావోస్ లో ఎక్కువ పెట్టుబడులు ఖరారు అయినట్లు స్పష్టం అవుతోంది. అయితే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం బుధవారం నాడు దావోస్ లో గ్రీన్ కో కంపెనీ తో ఒప్పందం చేసుకోనుంది. ఇది కూడా హైదరాబాద్ కేంద్రంగా పని చేసే కంపెనీనే. తెలుగు రాష్ట్రాల కు చెందిన కంపెనీ లతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇన్ని వ్యయ ప్రయాసల కోర్చి దావోస్ వెళ్లి ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం ఏముంది అన్న చర్చ సాగుతోంది. పైగా దీని కోసం రెండు ప్రభుత్వాలు కోట్ల రూపాయల్లో వ్యయం చేశాయి.