తెలంగాణ కాంగ్రెస్ లో జూబ్లీహిల్స్ జోష్

తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన రెండు ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నే విజయం సాధించింది. ఈ రెండు సీట్లు కూడా ప్రతిపక్ష బిఆర్ఎస్ కు చెందినవే. అధికారంలో ఉన్న పార్టీలు ఉప ఎన్నికలు గెలవటం కొంత సహజమే అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితి కి ఇది ఎంతో కీలకంగా మారింది అనే చెప్పాలి. ఒక వైపు ప్రతిపక్ష బిఆర్ఎస్ ఎంతో బలంగా ఒక వైపు హైడ్రా తో పాటు కాంగ్రెస్ హామీలు అమలు చేయటం లేదు...అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే రాష్ట్రంలో సమస్యలు వస్తున్నాయి అని ఎంత ప్రచారం చేసినా కూడా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ముఖ్యంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఈ ఎన్నిక పెద్ద సవాల్ గా మారగా...ఫలితం మాత్రం ఆయనకు షాక్ ఇస్తే...ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మాత్రం ఇది బిగ్ రిలీఫ్ గానే చెప్పుకోవచ్చు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం తేలితే వచ్చే ఉప ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు జూబ్లీ హిల్స్ ఫలితం కొంత బూస్ట్ గా పని చేస్తుంది అని చెప్పొచ్చు.
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక విషయంలో అభ్యర్థి ఎంపిక తో పాటు ఎంఐఎం మద్దతు సాదించటంతోనే కాంగ్రెస్ పార్టీ గెలుపు పక్కా అని తేలిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గతంలో ఎవరూ చేయని రీతిలో ఒక ఉప ఎన్నిక కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేసి మంచి ఫలితాన్ని సాధించుకోగలిగారు. అదే సమయంలో ఈ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించిన మంత్రులు కూడా తమ వంతు పాత్ర పోషించారు. మరో వైపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పది వేల మెజారిటీ తో గెలుస్తాడు అని ఎక్కువ మంది అంచనా వేశారు. అయితే అంచనాలు అధిగమించి మరీ ఏకంగా 24729 ఓట్ల మెజారిటీ తో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పై గెలిచారు. ఇది కాంగ్రెస్ కు రాజకీయంగా కొత్త ఉత్సహాన్ని ఇచ్చే పరిణామంగానే చెప్పాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో భారీ ఎత్తున వ్యతిరేకత పెరిగిపోయింది అని...ఇక ఎన్నికలు ఎప్పుడు వచ్చిన గెలుపు తమదే అన్నట్లు వ్యవహరించిన బిఆర్ఎస్ కు చేదు ఫలితం ఎదురైంది. మరో వైపు కనీసం కాంగ్రెస్ అభ్యర్థి మెజారిటీ తగ్గించాలనే ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఇది బిఆర్ఎస్ కు...ముఖ్యంగా ఈ ఎన్నికల బాధ్యతలు మోసిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు గట్టి షాక్ గానే చెప్పాలి.



