తెలంగాణ..కోటి టన్నుల ధాన్యాగారం
"తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు ఏడాదికి కేవలం 35 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే పండించేవారు. కానీ నేడు 1 కోటి పది లక్షల టన్నుల ధాన్యం రాష్ట్రంలో పండిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి నిర్మిస్తున్న భారీ నీటిపారుదల ప్రాజెక్టుల వల్ల 1 కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించుకోగలుగుతాం. బోర్ల ద్వారా మరో 40 లక్షల ఎకరాలకు పైగా నీరు వస్తుంది. ఏడాదికి 4 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసే గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ రూపాంతరం చెందుతున్నది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ ఎంతో బలోపేతం కావాలి. వ్యవసాయాధికారులు అడుగడుగునా రైతులకు అండగా నిలవాలి" అని ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపునిచ్చారు. సీఎం కెసీఆర్ ఆదివారం నాడు వ్యవసాయం శాఖపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. "రైతులు ఎప్పుడూ ఒకే పంట వేసే విధానం పోవాలి. పంట మార్పిడి విధానం రావాలి. పంట మార్పిడి వల్ల ఉత్పత్తి పెరిగి లాభాలు వస్తాయి. గ్రామాల్లో కూలీల కొరత ఉంది. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగాల్సి ఉంది.
పంటల సాగు విధానంలో ఆధునిక పద్ధతులు రావాలి. ఈ అంశాల పై రైతులకు వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలి. రాష్ట్రవ్యాప్తంగా 2600 క్లస్టర్లలో నిర్మించిన రైతువేదికలను వెంటనే వినియోగంలోకి తేవాలి. రైతులతో సమావేశాలు నిర్వహించాలి. పంటల సాగు, పంటల మార్పిడి, యాంత్రీకరణ, ఆధునిక సాగు పద్ధతులు, మార్కెటింగ్ తదితర అంశాల పై చర్చించి నిర్ణయం తీసుకోవాలి. క్లస్టర్ల వారీగా ఉన్న వ్యవసాయ విస్తరణాధికారులు వెంటనే గ్రామాల్లో పర్యటించాలి. ఏ గుంటలో ఏ పంట వేశారనే వివరాలు నమోదు చేయాలి. పది రోజుల్లోగా రాష్ట్రవ్యాప్తంగా సాగవుతున్నపంటల విషయంలో స్పష్టత రావాలి" అని ముఖ్యమంత్రి ఆదేశించారు.