ప్రపంచంలోనే అతి పెద్ద ఈవి కార్ల తయారీ కంపెనీ బీవై డీ

ప్రస్తుతం దేశంలో అమలులో ఉన్న విధానాల ప్రకారం ఆటోమొబైల్ రంగంలో విదేశీ కంపెనీలు వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో (ఎఫ్ డీఐ) యూనిట్లు ఏర్పాటు చేయవచ్చు. అయితే దీనికి ఆర్ బీఐ తో పాటు ఇతర శాఖల అనుమతులు తీసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. భారత్ తో సరిహద్దు పంచుకునే దేశాలు మాత్రం ప్రత్యేకంగా సెక్యూరిటీ క్లియరెన్స్ తీసుకున్న తర్వాతే ఇండియాలో యూనిట్ ఏర్పాటు చేయటానికి అనుమతి మంజూరు చేస్తారు. భారత్ తో సరిహద్దు పంచుకునే దేశాల్లో చైనా, పాకిస్థాన్, ఆఫ్ఘానిస్తాన్, నేపాల్, భూటాన్, బాంగ్లాదేశ్, మయాన్మార్ లు ఉంటాయి. ఇందులో ఆర్థికంగా శక్తివంతంగా ఉండి విదేశాల్లో పెట్టుబడులు పెట్టగలిగే స్థాయిలో ఉన్న దేశం అంటే ఒక్క చైనా నే ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది అని చెప్పొచ్చు. అయితే చైనాతో ఇండియా కు ఎన్నో సరిహద్దు సమస్యలు ఉన్నాయి.
నిత్యం చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కారణం అవుతుంది అనే విమర్శలు లేకపోలేదు. ప్రపంచంలోనే పాపులర్ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ అంటే ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా నే అని చెప్పాలి. అయితే ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ అంటే చైనా కు చెందిన బీవైడి మాత్రమే. బీవైడి అంటే బిల్డ్ యువర్ డ్రీమ్స్ అని అర్ధం. ఇప్పుడు ప్రపంచంలోనే నంబర్ వన్ గా ఈవి కార్ల కంపెనీ గా ఉన్న బీవైడీ తెలంగాణ లో తన తయారీ యూనిట్ ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాకపోతే బీవైడీ 2023 లోనే దేశంలోనే ఇప్పుడు వేగంగా పలు రంగాల్లోకి విస్తరిస్తున్న మేఘా ఇంజనీరింగ్ తో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేయగా అవి ఫలించలేదు. చైనాతో ఉన్న వివాదాల కారణంగా కేంద్రం అప్పటిలో కేంద్రం ఈ ప్రతిపాదనకు నో చెప్పింది. మేఘా ఇంజనీరింగ్ పెద్దలకు కేంద్రంలోని పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నా కూడా ఇది సాధ్యం కాలేదు. అయితే ఇప్పుడు తెలంగాణాలో బీవైడీ యూనిట్ ఏర్పాటుకు రెడీ అయింది...పెట్టుబడి కూడా 85000 కోట్ల రూపాయల వరకు ఉంటుంది అని వార్తలు వస్తున్నాయి.
ఇది కార్యరూపం దాల్చితే రేవంత్ రెడ్డి సర్కారు ప్రపంచంలోనే అతి పెద్ద ఈవి ఆటోమొబైల్ కంపెనీ ని ఆకర్షించినట్లు అవుతుంది. కేంద్రం ఒక సారి అత్యంత కీలకమైన సెక్యూరిటీ కియరెన్సు ఇస్తే బీవైడీ వంద శాతం ఎఫ్ డీఐ తో తెలంగాణాలో యూనిట్ ఏర్పాటు చేయటానికి మార్గం సుగమం అవుతుంది. అయితే ఇందులో జాయింట్ వెంచర్ భాగస్వామిని చేర్చుకోవాలా వద్దా అన్నది పూర్తిగా ఆ కంపెనీ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇండియాలో ఎలాన్ మస్క్ ప్రాజెక్ట్ లు వేగంగా కదులుతున్న విషయం తెలిసిందే. కేంద్రం నుంచి ఇంకా అనుమతులు రాకముందే ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ ఇండియాలో సేవలు ప్రారంభించేందుకు ఎయిర్ టెల్ తో పాటు రిలయన్స్ జియోతో కూడా ఒప్పందాలు చేసుకున్న సంగతి తెలిసిందే.
మరో వైపు ఇండియాలో టెస్లా కార్ల అమ్మకాలు కూడా ఏప్రిల్ నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా ముంబై లో ఒక షో రూమ్ ను అద్దెకు కూడా తీసుకుంది. త్వరలోనే దేశ రాజదాని ఢిల్లీ లో కూడా రెండవ షో రూమ్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది అని చెపుతున్నారు. మరో వైపు టెస్లా కూడా ఎప్పటి నుంచో ఇండియా లో యూనిట్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉంది. ఈ తరుణంలో చైనా కు చెందిన బీవైడీ ఇండియాలో తన తొలి యూనిట్ ను తెలంగాణాలో ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు వస్తున్న వార్తలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రచారం జరుగుతున్నట్లు ఇవి కార్యరూపం దాల్చుతాయా..లేక పొలిటికల్ గేమ్ ప్లాన్ లో భాగంగా వీటిని తెర మీదకు తెచ్చారా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు.